కేరళని వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్థినష్టంతో పాటు ప్రజలు కూడు గూడు లేకుండా అలమటిస్తున్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకుని ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ రూ.10కోట్ల సాయం ప్రకటించింది. కేరళలో జరిగిన నష్టం విలువ ఇరవై వేల కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇలా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు సరిసమానంగా విరాళం ప్రకటించడం విశేషం. రాష్ట్రాలపరంగా చూస్తే.. తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ అత్యధికంగా రూ. 25 కోట్లు కేరళకు ప్రకటించడమే కాకుండా అల్రెడీ కేరళ ముఖ్యమంత్రికి చెక్‌ను కూడా అందజేశారు. ఇక కేరళ వరదబాధితులకు అండగా నిలిచేందుకు కమల్‌హాసన్, సూర్య, రజనీకాంత్ వంటి పలువురు కోలీవుడ్ ప్రముఖులు భారీ విరాళాలు అందించారు. హీరో విక్రమ్ తాజాగా రూ.30 లక్షలు ప్రకటించాడు.
ఇక టాలీవుడ్ నుంచి మొదటగా దీనిపై స్పందించి రూ.25లక్షల విరాళం ప్రకటించిన హీరో అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ 5 లక్షలు, ఆ తర్వాత ‘గీతాగోవిందం’ నిర్మాత బన్నీవాస్ కూడా ఈ చిత్రం కేరళలో వసూలు చేసే షేర్‌ని కేరళ బాధితులకు అందిస్తున్నామని ప్రకటించారు. తాజాగా నాగార్జున - అమల కలిసి తమ వంతు సాయంగా రూ.28లక్షలు ఇచ్చారు. చిరంజీవి, వాళ్ల మదర్ అంజనాదేవి, రామ్‌చరణ్‌లు కలిపి రూ.51లక్షలు ఇస్తే, చరణ్ సతీమణి ఉపాసన రూ. 10లక్షల విలువైన మందులను ఇస్తామని తెలిపింది.
మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ రూ.25లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. కళ్యాణ్‌రామ్ రూ.10లక్షలు, దర్శకుడు కొరటాలశివ రూ.3 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు ఇలా ప్రతి ఒక్కరూ కేరళకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఇక మాలీవుడ్‌లో ఎంతో క్రేజ్ ఉండి, మలయాళీలకు బాగా దగ్గరైన బన్నీ అందరిలా 25లక్షలు కాకుండా ఇంకాస్త ఎక్కువ సాయం ప్రకటిస్తే బావుండేదనే మాట వినిపిస్తోంది. ఏదిఏమైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సినీప్రముఖులు వెంటనే స్పందిస్తూ ఉండటం అనాదిగా వస్తోంది. ఇది నిజంగా హర్షణీయం.