తెలుగు సినీ ఇండస్ట్రీలో చిత్రం చూసిన వెంటనే అది ఎలా ఉంది? ఏ స్థాయిలో హిట్ అవుతుంది.. అనే విషయాలను సరిగ్గా అంచనా వేసే దర్శకుడు రాజమౌళి. తాజాగా రాజమౌళి మాట్లాడుతూ..తానింత వరకు ఏదైనా సినిమా చూస్తే బాగుంటే బాగుందని చెబుతానే గానీ సినిమాని చూడమని ఎప్పుడు చెప్పలేదని కానీ మొదటి సారిగా తాను ఓ చిత్రం చూడమని ఆడియన్స్‌కి చెబుతున్నానని వ్యాఖ్యానించాడు. ఇంతకీ అదేమీ భారీ బడ్జెట్ చిత్రం కాదు. అందరు కొత్తవారితో రానా నిర్మాతగా మారి సమర్పిస్తోన్న ‘కేరాఫ్ కంచరపాలెం’.
ఈ సినిమాని చూసేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేశానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఏ సినిమా అయినా ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగితే ఆ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, అలాంటి చిత్రాలు పదిరోజులైనా మన మనస్సులో స్థానం సంపాదిస్తూ, మనల్ని వెంటాడుతాయని, ఆ కోవకి చెందే చిత్రమే ‘కేరాఫ్ కంచరపాలెం’ అని రాజమౌళి తెలిపాడు. సురేష్ ప్రొడక్షన్స్‌లో రానా సమర్పణలో రూపొందిన ఇందులో అందరు నటీనటులు కొత్తవారే. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగష్టీన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. న్యూయార్క్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు ఎంపికైనా ఏకైక చిత్రం, తొలి తెలుగు చిత్రం ఈ ‘కేరాఫ్ కంచలపాలెం’. ఇప్పటికే సుకుమార్, క్రిష్ వంటి దర్శకులు కూడా ఈ చిత్రం చూశామని, అది తమని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని ప్రశంసించారు. ఈ చిత్రంపై రాజమౌళి, సుకుమార్, క్రిష్ వంటి దర్శకులు బాగుందని కితాబునివ్వడం ‘కేరాఫ్ కంచరపాలెం’కి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.