మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు22వ తేదీ. ఈ సందర్భంగా చిరంజీవి తన తల్లి గారైన అంజనాదేవితో కలిసి మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్య్వూలో చిరంజీవి.. వాళ్ల అమ్మగారి గురించి చెబుతూ.. మా అమ్మ వారం పదిరోజుల కిందటే నాకు బర్త్‌డేగిఫ్ట్ ఇచ్చేసింది. అది బర్త్‌డే గిఫ్ట్ అని మా అమ్మకి కూడా తెలీదు. అమ్మ ఒంటరిగా ఒక ఇంట్లో ఉంటోంది. మేము ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కాస్త ఇన్నోవేషన్ చేయిస్తున్నాం. ఈమద్య మా అమ్మ.. ఒంటరిగా ఉండాలంటే ఏదోగా ఉంటోందిరా.. దిగులుగా ఉంటోంది. మీ ఇంటికి వచ్చేస్తా అని అడిగింది. అది విని నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఎందుకంటే అమ్మ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడింది. ఆమె నిర్ణయాన్ని మేమందరం గౌరవించాం. ఇప్పుడు తనే స్వయంగా వచ్చేస్తానురా అంది. ఇంతకు మించిన బర్త్‌డే గిఫ్ట్ నాకేం ఉంటుంది?
చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న నన్ను బాగా ట్రైన్ చేశారు. కట్టెపుల్లలు ఎలాంటివి తీసుకోవాలి? మంచి చేపలు ఎలా తీసుకుని రావాలి? పచారి సామాన్లు ఎలా ఎలా కొనాలి? వంటివన్నీ నేర్పించారు. లిస్ట్ రాసిస్తే పచారి షాపుకి వెళ్లి సామాన్లు తీసుకుని వచ్చేవాడిని. అమ్మకి 15ఏళ్ల వయసులో బొమ్మఅయినా కన్నబిడ్డ అయినా నేనే. నాన్న డ్యూటీకి వెళ్లిపోయేవారు. మాకు బందువులు చాలా తక్కువ. చుట్టపుచూపుగా వచ్చేవాళ్లంతే. దాంతో అమ్మకు, నాకు అటాచ్‌మెంట్ ఎక్కువ. తనకి ఏమి కావాలన్నా నేనే తెచ్చిపెట్టేవాడిని. చిన్నవయసులో మా అమ్మనాన్న నా బర్త్‌డేని ఘనంగా జరిపేవారు. కుర్చీలో కూర్చోబెట్టి అక్షింతలు వేసేవారు. వచ్చిన వారికి తాంబూలం, చలివిడి, శనగలు వంటివి ఏవో ఒకటి ఇచ్చేవారు.
హీరోగా ఉన్నప్పడు చెన్నైలో ఉండేవాళ్లం. నాడు అభిమానులు పుట్టినరోజుకి బస్సులు వేసుకుని వచ్చేవారు. కానీ ఆ తర్వాత బర్త్‌డేలపై ఇంట్రస్ట్ పోయింది. కానీ బర్త్‌డేని గ్రాండ్‌గా చేసుకోవాలని స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం మా అమ్మే. మిగిలిన సోదరులకు బర్త్‌డే చేసుకునే అలవాటు లేదు. వారికి దానిపై ఇంట్రస్ట్ లేదు. నా శ్రీమతి సురేఖ విషయానికి వస్తే నేను అదృష్టవంతుడిని. మా బంధువుల పిల్లలకు చదువు చెప్పించింది. పెళ్లిళ్లు చేసింది. ప్లాట్స్ కొనిచ్చింది. ఫైనాన్షియల్‌గా ఇబ్బందిలో ఉంటే తనే వారి అకౌంట్లో డబ్బులు వేసేది. అందుకే మా ఫ్యామిలీలో అందరికీ సురేఖ అంటే ప్రత్యేకమైన అభిమానం. మా అమ్మ అయితే కూతురుకంటే ఎక్కువ అంటుంది.. అని చెప్పుకొచ్చాడు.