సాధారణంగా మన ప్రేక్షకులు సినిమాలలో నటీనటులు పోషించే పాత్రలని బట్టి వారు నిజ జీవితంలో ఎలా ఉంటారు? అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. వృత్తిగత జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఎంతో తేడా ఉంది. గతంలో క్యాబరే డ్యాన్సర్‌గా చేసిన జయమాలిని ఎంతో అమాయకురాలు మాత్రమే కాదు. ఎదుటి వ్యక్తి మొహంలోకి చూసి మాట్లాడేది కూడా కాదు. ఇన్నేళ్ల ఈమె కెరీర్‌లో ఎలాంటి ఎఫైర్లు ఆమెపై రాలేదు. ఇక సినిమాలలో గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ఎంతో సౌమ్యురాలు.
ఇక విషయానికి వస్తే చిరంజీవికి సైతం పోటీ ఇస్తూ డ్యాన్స్‌లను స్టెప్పులను ఇరగదీసే వారిలో డిస్కోశాంతి ఒకరు. ఈమె చేసింది వ్యాంప్ పాత్రలే అయినా రియల్‌స్టార్ శ్రీహరిని వివాహం చేసుకుని సినిమాలకు బై చెప్పి గృహిణిగా తన బాధ్యతలను నెరవేర్చింది. ఇక శ్రీహరి మరణం తర్వాత ఈమె మరింతగా కుంగిపోయింది. ఆమె తాజాగా కాస్టింగ్‌కౌచ్‌పై స్పందించింది.
కాస్టింగ్ కౌచ్ వంటివి ప్రతి చోటా ఉంటాయి. అయితే ఎవ్వరూ మహిళలను బలవంతం చేయరు. అలా చేస్తే జైలుకి వెళ్లాల్సివస్తుందనే భయం అందరిలో ఉంటుంది. అవకాశాల కోసం కొందరు వారంతట వారే మగాళ్ల దగ్గరకి వెళ్తున్నారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం మీడియాలో వాటిని చెప్పుకుంటూ భ్రష్టుపట్టిస్తున్నారు. మగాడు పిలిచినప్పుడే చెంపమీద కొడితే అసలు గొడవే ఉండదు కదా..! నాకైతే అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. నన్ను చూస్తే అందరు భయపడే వారు. ఎవరైనా నాతో అలా ప్రవర్తిస్తే చంపేస్తాను. నాతో ఎవ్వరు అనవసరంగా మాట్లాడరు. అలా మాట్లాడితే ముందుగా నా నోటి నుంచి బూతులే వస్తాయి అని చెప్పుకొచ్చింది. నిజమే.. అందుకే ఆమెని డేరింగ్ లేడీగా అందరు పిలుస్తారు.