తమిళనాట నటిగా, పొలిటిషియన్‌గా, ముఖ్యమంత్రిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన జయలలిత తన చావులోనూ అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపుగా 74 రోజులు హాస్పిటల్ బెడ్ మీదున్న జయలలిత 2016 డిసెంబర్ 5 న కన్ను మూసింది. అయితే ఆమె చనిపోయిన నాటినుండి జయలలిత బయోపిక్ అంటూ అనేకమంది తెగ హడావిడి చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మ బయోపిక్ పట్టాలమీదకెక్కలేదు. కానీ ఇప్పుడు తమిళ డైరెక్టర్ అయిన విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ వుంటున్నట్లుగా.. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ ని బాలీవుడ్ లో కపిల్ దేవ్ బయోపిక్ ని నిర్మిస్తున్న విష్ణు ఇందూరి నిర్మాణ సంస్థ ప్రకటించింది.
తమ బ్యానర్ లో విజయ్ డైరెక్షన్ లో జయలలిత బయోపిక్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో జయలలిత పాత్రలో నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ లు కనిపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటి విద్యా బాలన్ ని అమ్మ పాత్రకి ఎంపిక చేస్తున్నట్లుగా.. ఇప్పటికే విద్య బాలన్ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇంతలోపులో అమ్మ అంటే జయలలిత బయోపిక్ ని నేను తెరకెక్కిస్తున్నా అంటూ.. మరో తమిళ లెజండ్రీ డైరెక్టర్ బయలుదేరాడనే వార్తలు కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతున్నాయి.
అదికూడా 2013 నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా.. జయలలిత బయోపిక్ సినిమా తీయడానికి రెడీ అవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ అని అనౌన్స్‌మెంట్ రాగానే భారతి రాజా కూడా జయలలిత బయోపిక్ మీద ఫోకస్ పెట్టడం.. ఆ సినిమాని నిర్మించడానికి ఆదిత్య భరద్వాజ్ అనే నిర్మాత ముందుకు రావడం జరిగిపోయాయంటున్నారు. మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా ని సంప్రదిస్తున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. మరి ఇన్నిజరుగుతున్న ఈ జయలలిత బయోపిక్ లో జయలలిత పాత్రధారి, అలాగే మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.