మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈనెల 22వ తేదీ. ఈ సందర్భంగా చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ..మా అబ్బాయి గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఇలా మా వాడితో కలిసి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే మొదటిసారి. చిరంజీవి డెలివరీ నాటికి నాకు 15ఏళ్లు మాత్రమే, నాడు నర్సాపురంలో ఉండేవారం. ఉదయం 4గంటలకే నొప్పులు మొదలయ్యాయని మిషన్ ఆసుపత్రికి గుర్రపుబండీలో వెళ్లాం. జోరు వాన. ఎలాగో ఆసుపత్రికి చేరాం. సోమవారం ఉదయం 11గంటలకు చిరంజీవి జన్మించాడు. నా గర్వం నా పిల్లలే. ముఖ్యంగా మా పెద్దబ్బాయి చిరంజీవి చిన్ననాటి నుంచి నాకు తోడుగా ఉండి నా బాధ్యతలను పంచుకున్నాడు. 25రూపాయలు ఇస్తే కూరగాయలు, పచారీ సామాన్లు వంటివన్నీ కొని రిక్షాలో జాగ్రత్తగా ఇంటికి తెచ్చేవాడు.
ఇక మా ఇంటికి పెద్దకోడలిగా సురేఖ వచ్చినప్పుడు మా అబ్బాయి నాకు దూరం అవుతాడని అసలు అనుకోలేదు. సురేఖ కూడా మమ్మల్ని తన తల్లిదండ్రులలాగే జాగ్రత్తగా చూసుకునేది. మాకేం కావాలో మేముగానీ, మాఅబ్బాయి గానీ చెప్పకుండానే మాకేం కావాలో అది చేసి పెట్టేది. అలాంటి పెద్ద కోడలు మాకు రావడం మా అదృష్టం. ఆమెని మా కోడలు అనుకోలేదు. మా కూతురనే భావించాం. కూతురు కంటే కూడా ఎక్కువే. మమ్మల్ని ఏం తిన్నారు? అని ఆప్యాయంగా అడుగుతుంది. ఏది తినాలో.. ఏది మంచిదో చెబుతుంది. సమయానికి మందులు వేస్తుంది. మా మీద అంత శ్రద్ద. ఇటీవల నా కోసం ఓ నర్సుని కూడా పెట్టింది. నాకు, మా పెద్దకోడలికి మంచి అనుబంధం ఉంది. పెద్దకోడలు మంచిదైతే కుటుంబం జీవితాంతం కలిసే ఉంటుంది అని చెప్పడానికి సురేఖనే ఉదాహరణ.
ఇక నా కుమారులు అందరిలో ఏదో ఉద్యోగస్తులైతే సరిపోయేదని నేనెప్పుడు భావించలేదు. వారు ఈ స్థితిలో ఉండటం నా అదృష్టం. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు. చిరు అన్నప్రాసన నాడు కత్తి పట్టుకున్నాడు. ఆ కత్తిని ‘ఖైదీనెంబర్ 150’ వరకు వదలలేదు. ఇప్పుడు ‘సై..రా’కి కూడా కత్తి పట్టుకుంటున్నాడు. వీడిది అంతా మా నాన్న పోలిక. చిన్నప్పుడు భలే అల్లరి చేసేవాడు. ఒక్కడే వీధిలోకి వెళ్లి పడుకున్నాడు. నాకు కనిపించక ఎంతో టెన్షన్ పడ్డాను. చుట్టుపక్కల వారు పిల్లాడిని అలా వదిలేస్తే ఎలా అని అరిచారు. దాంతో వాడిని తువాలుతో మంచెంకి కట్టేసేదానిని. ఇప్పటికీ వీడు చూడటానికి కామ్‌గా కనిపిస్తాడు. కానీ వీడి అల్లరి భరించలేం.. అంటూ తన కుమారుడి చిన్ననాటి విషయాలను చెప్పుకొచ్చింది.