కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార హవా ‘చంద్రముఖి’తో స్టార్ట్ అయి, ఇన్నేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నా కూడా ఆమెకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఆమె తెరపై కనిపిస్తే చాలు తమిళ తంబీలు పండుగ చేసుకుంటారు. ఆమె అందం, అభినయానికి ఆమె తలైవిగా పేరు తెచ్చుకుంటోంది. ఇక ఇటీవల ఆమె హీరోయిన్, గ్లామర్ వేషాలు, ఇతర పాత్రలను తగ్గించి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన సత్తా చాటుతోంది. హీరోలతో సరిసమానమైన ఓపెనింగ్స్‌ని, కలెక్షన్లను సాధిస్తోంది. విజయశాంతి, అనుష్కలతో ధీటుగా ఈమె కెరీర్ సాగుతోంది. మరింతగా చెప్పాలంటే వారిద్దరి కంటే నయనతారకే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు.
ఇటీవల ‘ఆరమ్’ చిత్రంలో సిన్సియర్ ఐఏయస్ ఆఫీసర్‌గా నటించి రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఆమె నటించిన ‘కొలమావు కోకిల’ తాజాగా విడుదలై సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్‌ని సాధించుకుని బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోందని, ఆమె కెరీర్‌లో ఈ చిత్రం కూడా ఓ పెద్దహిట్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ కథ మొత్తాన్ని ఆమె తన భుజస్కంధాలపైనే మోయడం ఆమెకి ఉన్న క్రేజ్‌కి నిదర్శనంగా చెప్పాలి. ఈ చిత్రంలో నయనతార నటన పట్ల విమర్శలకుల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ చిత్రంతో ఆమె మరోసారి ‘లేడీ సూపర్‌స్టార్’ అనే బిరుదును సార్ధకం చేసుకుందని అంటున్నారు. 25కోట్లు ఖరీదు చేసే డ్రగ్స్‌ని తన కుటుంబ సభ్యులతో కలిసి నయనతార ఎలా తరలించింది అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిక్స్ చేసుకున్న థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. త్వరలో ‘కో..కో..కోకిల’ పేరుతో ఈ చిత్రం తెలుగులోకి డబ్ కానుంది. మరోవైపు ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సై..రా..నరసింహారెడ్డి’, అజిత్ ‘విశ్వాసం’ వంటి పలు చిత్రాలతో బిజీగా ఉంది.