ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో ‘ఆల్ వెరైటీ మూవీ మేకర్స్’ పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించిన వినూత్న కథాచిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ఏ బ్రేకప్ లవ్ స్టోరీ అన్నది ట్యాగ్ లైన్. అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో బాబూమోహన్, సుమన్, ధన్ రాజ్, చిత్రం శ్రీను, అపూర్వ, బాలాజీ, డి.ఎస్.రావు, ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకట్ సంగీత సారధ్యం వహించగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు అనూహ్యమైన స్పందన వస్తోంది. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకులు వి.వి.వినాయక్ చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఎస్.ఏ.రెహమాన్, నిర్మాత బి.చంద్రశేఖర్ (పెదబాబు), హీరో అర్జున్ రెడ్డి, హీరోయిన్ నేహా దేశ్ పాండే పాల్గొన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ... ‘‘ఈ చిత్ర నిర్మాత, రచయిత అయిన చంద్రశేఖర్ గారు.. నాకు గన్నవరం ఎం.ఎల్.ఏ వల్లభనేని వంశీ ద్వారా చాలా కాలంగా సుపరిచితులు. ఒక నిర్మాతలో రచయిత ఉన్నప్పుడు.. నూటికి నూరు పాళ్లు విజయం సాధిస్తారు. ‘బిచ్చగాడా మజాకా’ థియేట్రికల్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ఉన్న మెసేజ్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వినోద భరిత సందేశాత్మక చిత్రాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. ప్రోత్సహిస్తాయనే నమ్మకం కూడా ఉంది. యూనిట్ మెంబెర్స్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చిన నిర్మాత బి.చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ.. ‘బిచ్చగాడా మజాకా’ రొటీన్ లవ్ స్టోరీ కాదు. ‘కష్టపడి పనిచేసి జీవితంలో పైకి వచ్చేవాడు లక్కీ ఫెలో. ఓసీగా ఇతరుల కష్టంతో బతికేయాలనుకుని పేదవాడిగా బిచ్చగాడిగా బ్రతికేవాడు అన్ లక్కీ ఫెలో’ అనే ఫిలాసఫీతో ఈ చిత్రం రూపొందింది. వి.వి.వినాయక్ వంటి దర్శక సంచలనం మా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసి.. మెచ్చుకోవడం చాలా గర్వంగా ఉంది.. అన్నారు.
చిత్ర సమర్పకులు ఎస్.ఏ.రెహమాన్, దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరావు, హీరో అర్జున్ రెడ్డి, హీరోయిన్ నేహా దేశ్ పాండే.. సినిమా సాధించబోయే విజయంపై ధీమా వ్యక్తం చేసి.. వి.వి.వినాయక్ కి కృతజ్ఞతలు తెలిపారు.