సినిమాలను ప్రకటించడం, హాట్‌టాపిక్‌లు నడుస్తున్న సమయంలోనే కొన్ని వివాదాస్పద చిత్రాలను అనౌన్స్ చేయడంలో వర్మది అందెవేసిన చేయి. నిజానికి వర్మ గొప్ప దర్శకుడు, టెక్నీషియన్ అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌లో పాగా వేసి, అక్కడి బాలీవుడ్ వారే మాఫియా చిత్రాలను తీయడానికి భయపడుతున్న రోజుల్లో వర్మ తనదైన స్టైల్‌ని చూపించాడు. అంతకు ముందు తరంలో ఏ దర్శకుడు కూడా తెలుగు నుంచి వెళ్లి ఆ స్థాయి సంచలనాలను సృష్టించలేకోపోయారు. అది వర్మకే సాధ్యమైంది. ఇక ఇతర దర్శకులు వంద చిత్రాలను డైరెక్ట్ చేసినా తయారు చేయలేని శిష్యులను.. ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే సొంతం.
ఇక వర్మ మంచి డైరెక్టరా? కాదా? అనే విషయంలో ఎవరి వాదనలు వారి వద్ద ఉండవచ్చు గానీ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రకంపనలు సృష్టించి, చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో నిర్మాతగా వర్మ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ‘సావిత్రి, శ్రీదేవి, రెడ్డిగారు పోయారు, లక్ష్మీస్ వీరగ్రంధం, న్యూక్లియర్’ ఇలా ఎన్నో చిత్రాలను ప్రకటించి ఆ తర్వాత వాటిని వదిలేసి వార్తల్లో ఉండేలా చూసుకోవడంలో వర్మ ముందుంటాడు. ఆయన చిత్రాలను తీసే బడ్జెట్‌ని చాలా తక్కువగా ఉండేలా చూసి కేవలం దేశవ్యాప్తంగా తన చిత్రం ఓ నాలుగైదు రోజులు ఆడితే చాలు డబ్బులు తిరిగి వచ్చేలా ఆయన టెక్నిక్ ఉంటుంది. ఇక ఈయన తీసిన ‘ఆఫీసర్’ డిజాస్టర్ కావడంతో ఈమద్య ఆయన పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు.
తన శిష్యుడు అజయ్‌భూపతి తీసిన ‘ఆర్‌ఎక్స్100’ని మాత్రం ప్రమోట్ చేశాడు. ఇక తాజాగా వర్మ మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఆయన భాస్కర్ అనే నిర్మాతతో కలిసి తన శిష్యుడైన సిద్దార్ద్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘భైరవగీత’ అనే చిత్రం తీయనున్నాడట. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ని ఇస్తూ ఓ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశాడు. టైటిల్ ‘భైరవగీత’ని వింటే ఇదేమైనా భగవద్గీతకు వర్మ చెప్పే కొత్త వెర్షనా? లేక ‘గీతాగోవిందం’ సమయంలో తన చిత్రాన్ని ఇలా టైటిల్‌ని ఫిక్స్ చేశాడా? అనే అనుమానం రాకమానదు. మరి ఇదైనా పట్టాలెక్కి విడుదల అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది.