నేటిరోజుల్లో ఏ సినిమా కైనా ప్రమోషన్ అనేది అత్యంత కీలకంగా మారింది. మామూలూ పబ్లిసిటీతో పాటు ఇతర సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా ఫలానా చిత్రం బాగుందంటూ మాట్లాడుతుంటే ప్రేక్షకులు వారి మీద ఉన్న నమ్మకంతోనే థియేటర్లకు వస్తున్నారు. ఇందులో రాజమౌళి వంటి వారి పాత్ర కూడా ఎంతో కీలకంగా మారింది. ఒకరి చిత్రాన్ని మరొకరు మెచ్చుకోవడం హర్షణీయమే కాదు.. ఈ చిత్రం విజయంపై కూడా బాగా ప్రభావం చూపుతోంది. స్టార్స్ చిత్రాలకు కూడా ఇది తప్పడం లేదు. మరి చిన్న చిత్రాలంటే ఖచ్చితంగా పెద్ద వారితో ప్రమోషన్స్ చేయిస్తేనే క్రేజ్, ఆడియన్స్‌లో ఉత్సుకత వస్తాయి. అందుకే టైటిల్, టైటిల్ లోగో, ఫస్ట్‌లుక్, టీజర్లు, ట్రైలర్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు బాగా పెరిగిపోతున్నాయి.
ఇక నాగార్జున, సమంతల విషయానికి వస్తే వారు ఒకరినొకరు తమ చిత్రాలను బాగా ప్రమోట్ చేసుకోవడంతో పాటు ఆయా చిత్రాలపై ప్రేక్షకులకు ఆసక్తిని రేపేలా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ‘రాజుగారి గది2’ నుంచి ‘రంగస్థలం’ వరకు ఇది బాగానే వర్కౌట్ అవుతోంది. ఇక ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత తాజాగా కన్నడ రీమేక్ ‘యు టర్న్’ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తోంది. ఇందులో సమంతతో పాటు భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ వంటి వారు నటిస్తున్నారు. కన్నడ ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్‌కుమారే దీనికి డైరెక్టర్ కావడం విశేషం. ఇక తాజాగా ఈ ‘యుటర్న్’ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ మొత్తం ఎంతో ఆసక్తిని రేపుతూ కట్ చేశారు.
ఈ టీజర్‌ని చూసిన వెంటనే మామ నాగార్జున తన కోడలు సమంతని ఉద్దేశించి ‘వావ్.. నువ్వు సర్‌ప్రైజ్ ఇవ్వకుండా ఉండవు కోడలా.. మొత్తం యూనిట్‌కి బెస్టాఫ్ లక్’ అనిట్వీట్ చేశాడు. దానికి కోడలు సమంత స్పందిస్తూ డ్యాన్స్ చేస్తోన్న ఎమోజీలను పోస్ట్ చేసి ‘నన్ను ఎప్పుడు ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు మామా’ అని రీట్వీట్ చేసింది. ఇక ఈ టీజర్‌ని చూసిన సమంత భర్త నాగచైతన్య, ఫ్రెండ్ రానాలు కూడా స్పందించారు. నాగచైతన్య ‘నా లేడీ కొత్త సినిమా యు టర్న్. ఆమె పరిధిని దాటి నటిగా వృద్ది చెందడం సంతోషంగా ఉంది. మొత్తం యూనిట్‌కి శుభాకాంక్షలు అని ట్వీట్ చేయగా, రానా కూడా ‘చక్కగా నటించావు సమంత’ అని పోస్ట్ చేశాడు. ఇలా వారి ఫ్యామిలీలోని వారిని వారే ప్రమోట్ చేసుకోవడంలో మాత్రం వీరు ముందుండటం విశేషం.