మన హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఏదో పెద్ద గొప్పగా ఒకేసారి ఎన్ని చిత్రాలు విడుదలైనా ఏ చిత్రం వసూళ్లు దానికి ఉంటాయని, మరో చిత్రం వల్ల కలెక్షన్లు తగ్గడం జరగదని అంటుంటారు. ఈ విషయంలో ఈమద్య స్టార్స్‌లో మాత్రం మార్పు వచ్చింది. వాస్తవాలను గుర్తించిన స్టార్స్ మరో స్టార్ చిత్రానికి మద్య కనీసం రెండు వారాల గ్యాప్ తీసుకుంటున్నారు. అయినా కూడా ఆ ప్రభావం ఉండనే ఉంటోంది. కిందటి ఏడాది ఇలాగే నితిన్ ‘లై, బోయపాటి జయ జానకి నాయకా, రానా నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు ఒకేసారి రావడం వల్లనే ‘లై’ వంటి విభిన్న చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జయ జానకి నాయకా పరిస్థితి కూడా అదే. వీటిల్లో కాస్త నేనే రాజు నేనే మంత్రి మాత్రమే మంచి వసూళ్లు సాధించింది.
ఇక విషయానికి వస్తే ఈనెల 3వ తేదీన అడవిశేష్ హీరోగా రూపొందిన గూఢచారి చిత్రం విడుదలై అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. భారీ కలెక్షన్లతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా దూసుకుని పోతోంది. దీనికి కాస్త గ్యాప్ తీసుకుని వచ్చిన ‘గీతాగోవిందం’ ఎఫెక్ట్ ‘గూఢచారి’పై బాగా పడిందని కలెక్షన్లే రుజువు చేస్తున్నాయి. మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమని భావించిన ‘గూఢచారి’ 0.7 మిలియన్ల వద్ద ఆగిపోయింది. అదే ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపిస్తోంది.
రెండు వేరు వేరు జోనర్ల చిత్రాలైనప్పటికీ, అందునా దాదాపు రెండు వారాల గ్యాప్ ఉన్నప్పటికీ ‘గూఢచారి’ వసూళ్లను ‘గీతాగోవిందం’ గండి కొట్టింది. దాంతో ఈ చిత్ర యూనిట్ అమెరికాలో ప్రమోషన్ల కోసం వెళ్తున్నారు. నేటిరోజుల్లో జనాలు ఒక్క చిత్రం చూసేందుకే భారీ ఖర్చు చేయాల్సి వస్తూ ఉండటంతో ఏది చాయిసో ఎంచుకుని మరీ సినిమా థియేటర్లకు వెళ్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు.