తన తొలి చిత్రం ‘ఆది’తోనే స్టార్ స్టేటస్‌ని సాధించిన దర్శకుడు వి.వి.వినాయక్. ఈయనను వెరీ వెరీ స్పెషల్ డైరెక్టర్ అని, విక్టరీ వినాయక్ అని అందరు పిలుచుకునే వారు. ఇక ఈయన జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లుఅర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరితో సినిమాలు చేశాడు. ఈ తరం దర్శకులు ఎవ్వరికీ వీలుకాని విధంగా చిరుతో రెండు చిత్రాలు చేయడం విశేషం. ఈయన స్టార్ హీరోలతో పాటు నితిన్‌తో ‘దిల్’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ‘అల్లుడుశీను’, అక్కినేని అఖిల్‌తో ‘అఖిల్’ వంటి చిత్రాలు తీశాడు.
ఇక విషయానికి వస్తే ఈ మధ్య వినాయక్, పూరీజగన్నాథ్, శ్రీనువైట్ల వంటి వారు యువతరం దర్శకుల ముందు సరిగా నిలవలేకపోతున్నారు. ఎప్పుడు పాతచింతకాయ పచ్చడి వంటి హీరోయిజం, హీరో గొప్పతనాన్ని ఎవరిచేతనో చెప్పించడం, ఫ్లాష్‌బ్యాక్‌లలో హీరోని ఎలివేట్ చేయడం వంటి మూస చిత్రాలను తీస్తున్నారు. తాజాగా ‘చెన్నకేశవరెడ్డి’ తర్వాత బాలకృష్ణ రెండో చిత్రం చేయడానికి వినాయక్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్, సి.కళ్యాణ్ నిర్మాత అనేది కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసే బిజీలో బాలయ్య తలమునకలై ఉన్నాడు. సో.. వినాయక్ బాలయ్యతో చిత్రం కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిందే. ఈ గ్యాప్‌లో ఆయన మంచు విష్ణుతో ఓ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది.
ఇప్పటివరకు తన కెరీర్‌లో ‘ఢీ, దూసుకెళ్తా, ఈడో రకం ఆడో రకం’ వంటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి గానీ నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ ఒకటి కూడా లేదు. ప్రస్తుతం మంచు విష్ణు తెలుగు, తమిళంలో రూపొందుతున్న ‘ఓటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఆయన పరశురాం దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని, ఈ చిత్రాన్ని మోహన్‌బాబే నిర్మిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ‘గీతాగోవిందం’ హిట్‌తో పరశురాంకి వరుస అవకాశాలు వస్తూ ఉండటంతో ఆయన వేరే నిర్మాతలకు కమిట్ అయ్యాడట. మరి వినాయక్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించే విషయంపై తుది నిర్ణయం తెలియడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు.