మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా నాగబాబు ఎంట్రీ బాగా జరిగింది. ఆజానుబాహుడు కావడం, దానికి తగ్గట్లుగా పెక్యులర్ వాయిస్ ఉండటం, ఆ గొంతు గంభీరంగా ఉండటం ఆయనకు బాగానే కలిసి వచ్చాయి. అయితే ‘420, సర్కార్ ఎక్స్‌ప్రెస్’తో పాటు పలు చిత్రాలలో హీరోగా నటించినా ఆయన రాణించలేకపోయాడు. ఆయన ఫిజిక్‌కి డ్యాన్స్‌లు సరిగా సూట్ కావు. ఇలా ఆయన హీరోగా రాణించలేకపోయినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఈయన నటన, డైలాగ్ డెలివరీలలో ఓ కొత్తదనం ఉంటుందని, అందుకే ఆయనకు ‘143’తో పాటు పలు చిత్రాలలో స్పెషల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తుంటానని ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈయన టివి ఆర్టిస్ట్‌గా, జబర్ధస్త్ వంటి షోల ద్వారా అలరిస్తూనే ఉన్నారు. కాగా గత కొంతకాలంగా ఆయన గొంతుకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ‘జబర్దస్త్’ ఫాలో అయ్యేవారికి అది అర్ధమై ఉంటుంది. ఇక ఈనెల 15న గీతాఆర్ట్స్2 బేనర్‌లో రూపొంది విడుదలైన ‘గీతాగోవిందం’లో ఆయన ఓ ప్రత్యేక పాత్రను పోషించాడు. సూపర్‌హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రంలో నాగబాబుకి వేరే వారు డబ్బింగ్ చెప్పడంతో ప్రేక్షకులు కాస్త అయోమయానికి లోనయ్యారు. ఆయన గొంతు సమస్యతో బాధపడుతున్నందువల్లే చిత్ర యూనిట్ ఆయన పాత్రకు వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించింది.
ఇక ప్రస్తుతం నాగబాబు మరో కీలకమైన పాత్రను త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఆ చిత్రం డబ్బింగ్ సమయం నాటికైనా నాగబాబు గొంతు సమస్య తీరితే ఆ పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. లేదంటే ‘గీతాగోవిందం’లాగానే ఆయన మరోసారి అరువు గొంతుపైనే ఆధారపడాల్సిరావచ్చు.