మాస్, యాక్షన్ హీరోలుగా ఇమేజ్ రావడం ఎంతో అదృష్టమనే చెప్పాలి. దానికోసం పాతకాలంలో ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు ఎంతో కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ మాస్‌ఇమేజ్‌ని సాధించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణలకు కూడా మాస్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ఎంతో సమయం పట్టింది. కృష్ణ కుమారుడు మహేష్‌కి కూడా ‘ఒక్కడు, పోకిరి’ దాకా అలాంటి ఇమేజ్ రాలేదు. ఇక రామ్‌చరణ్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారసులు కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మాస్ ఫాలోయింగ్‌ని సాధించారు. ఇలా స్టార్ వారసులకి కూడా పూర్తి మాస్ ఇమేజ్ రావడానికి ఎంతో కాలం పట్టింది.
నాగార్జున కుమారుడు, ఏయన్నార్ మనవడైనా కూడా అఖిల్ మొదటి చిత్రంతోనే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశపడి బొక్కబోర్లాపడ్డాడు. నాగార్జునకి ‘శివ’ చిత్రానికి వరకు ఆ ఇమేజ్ రాలేదు. కానీ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాత్రం ఇప్పటివరకు స్టార్ హీరోయిన్లనే పెట్టుకుంటూ, వినాయక్, బోయపాటి శ్రీను వంటి టాప్ పవర్‌ఫుల్ డైరెక్టర్స్‌తో చేసినా కూడా భారీ బడ్జెట్ వల్ల ఆయా చిత్రాలు నష్టాలనే మిగిల్చాయి. ఇటీవల వచ్చిన ‘సాక్ష్యం’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు సరైన రూట్‌లోకి వచ్చాడు. నాని, విజయ్‌దేవరకొండలా ఒక్కో మెట్టు ఎక్కుతూ, ముందు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అందుకే ఆయన ఇకపై కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు, కొత్త దర్శకులతో విభిన్నమైన లోబడ్జెట్ చిత్రాలలో నటించాలని నిర్ణయించుకున్నాడట. నిజానికి టాలీవుడ్‌లో నిర్మాత, దర్శకుల వారసులలో వెంకటేష్ మినహా మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కాబట్టి ఈ నిర్ణయం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి మేలు చేస్తుందనే భావించాలి. ఎంత తండ్రి నిర్మాత అయినా ప్రతి సినిమాకి కోట్లలో నష్టాలు వస్తే ఎవరు మాత్రం ఎంత కాలం ఈ హీరోని భరిస్తారు? కాబట్టి సాయిశ్రీనివాస్ మార్పు మంచికేనని చెప్పాలి.