తెలుగులో యాంగ్రీయంగ్‌మేన్‌గా ఒకప్పుడు రాజశేఖర్‌కి మంచి ఇమేజ్ ఉండేది. ముఖ్యంగా ఆయన నవ్వు చూసి ఎందరో అమ్మాయిలు ఆనాడు ఆయనకు ఫ్యాన్స్‌గా మారారు. ‘తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, రౌడీయిజం జిందాబాద్’ వంటి చిత్రాల ద్వారా పవర్‌ఫుల్‌గా ఎలా మెప్పించాడో.... ‘గోరింటాకు, మా అన్నయ్య, సింహరాశి’ వంటి చిత్రాల ద్వారా ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రల్లో కూడా ఒదిగిపోయాడు. ఇంకోవైపు అల్లరి ప్రియుడు వంటి చిత్రాల ద్వారా రొమాంటిక్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన శ్రీమతి జీవిత కూడా మంచి నటే కాదు.. నిర్మాత, దర్శకురాలు కూడా. అయితే వీరిపై ఓ విమర్శ ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వివాదాస్పదమైన జంటగా వీరిని చెప్పవచ్చు.
మెగాభిమానులతో వైరం, వరుసగా పార్టీలు మారుస్తూ, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వారు విమర్శలకు గురయ్యారు. మరోవైపు జీవిత కూడా నిర్మాత, దర్శకురాలిగా రాణించలేకపోయింది. ఇలా దాదాపు పుష్కరం పాటు హిట్ లేకుండా ఉన్న రాజశేఖర్‌కి ఇటీవల ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ‘పీఎస్వీగరుడవేగ’ చిత్రం ఆర్ధికంగా లాభాలను తేకపోయినా మరలా రాజశేఖర్‌కి రీఎంట్రీ మూవీగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ఆయన మరో చిత్రం ఒప్పుకోకపోవడం ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇక విషయానికి వస్తే రాజశేఖర్-జీవితల పిల్లలు శివాని ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంగా ఆమె ‘గూఢచారి’తో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అడవి శేషు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది.
ఇప్పుడు వారి చిన్నకూతురు శివాత్మిక కూడా నటనపై ఆసక్తిని పెంచుకుంటున్నట్లు స్వయంగా జీవిత ప్రకటించింది. మొదట రాజశేఖర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఓ స్కూల్‌ని ఏర్పాటు చేసి, ఆ బాధ్యతలను శివాత్మికకి ఇవ్వాలని భావించాడట. కానీ ఆమె మాత్రం నటనపై ఆసక్తి చూపుతుండటంతో రాజశేఖర్, జీవితలు సినిమాలలో తమకున్న అనుభవాన్ని వారికి నేర్పుతున్నారు. ఇక నేడు యంగ్ హీరోలలో దాదాపు సగం మంది మెగా హీరోలే కనిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో మెగా హీరోలు కలిసి నటిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.