ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టింది మొదలు స్టార్ డైరెక్టర్స్‌తోనూ, అలాగే స్టార్ హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తున్న బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లకొండ శ్రీనివాస్ కి సాక్ష్యం దెబ్బకి కాస్త తెలివొచ్చినట్టుగా అనిపిస్తుంది. లేదంటే వినాయక్, బోయపాటి లాంటి డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలనుకుని సాధించిన శ్రీనివాస్ ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కి అవకాశమిస్తూ.. స్టార్ డైరెక్టర్స్ కి దూరం జరుగుతున్నాడనే టాక్ వినబడుతుంది. అల్లుడు శీను సినిమాని వినాయక్ డైరెక్షన్ లో చేసిన శ్రీనివాస్ తర్వాత కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర రెడ్డి తో సినిమా చేసాక.. మళ్ళీ మాస్ దర్శకుడు స్టార్ దర్శకుడు అయిన బోయపాటితో జయ జనకి నాయక చేశాడు. ఆ సినిమా సోలోగా విడుదలైతే హిట్ అయ్యేది కానీ.. రెండు సినిమాల మీద పోటీకి దింపి చేతులు కాల్చుకున్నారు. ఇక నిన్నగాక మొన్న భారీ పెట్టుబడితో శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేసాడు. ఏదో నిర్మాతలు సినిమాని విడుదలకు ముందే అమ్ముకోబట్టి.. అభిషేక్ పిక్చర్స్ వారు సేవ్ అయ్యారు గాని.. లేదంటేనే వారికీ బాగా నష్టాలొచ్చేవే.
అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ ని పక్కనబెట్టి శ్రీనివాస్ ఒక కొత్త దర్శకుడికి, తేజతో రెండు సినిమాలకు ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ డైరెక్టర్స్ విషయంలో కాంప్రమైజ్ అయినా... హీరోయిన్ విషయంలో అవ్వలేదు. అందుకే రెండు సినిమాల్లోనూ హీరోయిన్ కాజల్ తోనే జోడి కడుతున్నాడు. కాకపోతే ఇప్పుడు మీడియం బడ్జెట్‌తోనే రెండు సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మరో కొత్త దర్శకులు చెప్పే కథలు వింటున్నాడట. అంటే కొత్త దర్శకులతో సినిమాలంటే ఎలా లేదన్నా.. లో అండ్ మీడియం బడ్జెట్‌లతోనే సినిమాలు ఉంటాయి. సో ఆ విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఇటు స్టార్ డైరెక్టర్స్ తో పాటుగా.. అటు బడ్జెట్ విషయంలోనూ వెనక్కి తగ్గాడన్నమాట.