సినిమా ఫీల్డ్‌లో ఒకరి కోసం అనుకున్న పాత్రలకు పలు కారణాల వల్ల ఇతరులను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ తీయాలనుకున్న 'అల్లూరి సీతారామరాజు' కృష్ణ చేయడం, మహేష్ వదులుకున్న చిత్రాలు ఇతర స్టార్స్ చేయడం, పవన్‌కళ్యాణ్‌కి అనుకున్న స్టోరీలు మహేష్, రవితేజ వంటి వారికి రావడం వంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక కొన్నిసార్లు ఇవి పాత్ర నచ్చకపోవడం, సినిమా ఆడదనే కారణం... ఆ చిత్రంపై నమ్మకం లేకపోవడం వంటి వాటితో పాటు పారితోషికాల కారణంగా కూడా పలువురు ఎన్నో మంచి సినిమాలను పొగొట్టుకుంటూ ఉన్నారు. రాఘవేంద్రరావు, మోహన్‌బాబుల కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లుడుగారు', 'కొదమసింహం'లోని పాత్రలను నటి యమున కూడా మిస్ చేసుకుంది. వాటిల్లో నటించిన వారు బాగా క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇక తాజాగా ఇదే పరిస్థితి రాశిఖన్నాకి ఎదురైంది. ఈమె రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు అటు ఇటుగా ఇండస్ట్రీకి వచ్చింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్‌గా మారి, అందరు యంగ్ స్టార్స్‌తో నటించింది. కానీ రాశిఖన్నా మాత్రం పెద్ద హీరోల చిత్రాలలో సెకండ్ హీరోయిన్‌గా, చిన్న చిత్రాలతో నెట్టుకొస్తోంది. అందం, అభినయం, టాలెంట్ అన్ని ఉన్నా ఆమెకి పేరు తెచ్చిన ఓకే ఒక్క చిత్రం 'తొలిప్రేమ'. ఇక తాజాగా విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతోన్న 'గీతగోవిందం' చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట దర్శకుడు పరశురాం, నిర్మాత బన్నీవాసులు లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని భావించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ రాశిఖన్నా వద్దకు వెళ్లింది. కథ నచ్చినా కూడా కోటి రూపాయల పారితోషికం ఆమె డిమాండ్ చేసిందట. నిర్మాతలు కాస్త తగ్గించుకోమని చెప్పినా నో చెప్పిందని సమాచారం. దాంతో ఆ పాత్రకు రష్మిక మందన్నను తీసుకున్నారు.
గీతాఆర్ట్స్‌లో, అందునా విజయ్ దేవరకొండతో నటించే చాన్స్‌ని రాశిఖన్నా వదులుకుంది. ఇప్పుడు అదే చిత్రం రష్మికను అందలం ఎక్కించింది. మరోవైపు ఆమె దిల్‌రాజు బేనర్‌లో నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటించిన 'శ్రీనివాసకళ్యాణం' ఫ్లాప్ కావడం, మరోవైపు అదే సమయంలో వచ్చిన 'గీతగోవిందం' సూపర్‌హిట్‌గా సాగుతూ ఉండటం ఆమె బ్యాడ్‌లక్ అని, ఆమె జడ్జిమెంట్ సరికాదని చెప్పుకోవాలి.