తాజాగా విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీగా విడుదల అయింది. ఇక విషయానికి వస్తే తాజాగా కేరళలో భారీ వర్షాల వల్ల అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. ఈ విషయంలో కమల్‌హాసన్ నుంచి విశాల్, సూర్య వంటి కోలీవుడ్ స్టార్స్‌తో పాటు తెలుగులో యంగ్ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న విజయ్‌దేవరకొండ కూడా తనవంతు సాయంగా కేరళ వరద బాధితులకు రూ.5లక్షల విరాళం ప్రకటించాడు.
ఇక తాజాగా 'గీతగోవిందం' హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కేరళలో కూడా విడుదల అయిన నేపధ్యంలో ఈ చిత్ర నిర్మాత బన్నీవాసు కూడా కేరళ వరద బాధితుల సహాయార్దం ముందుకు వచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, కేరళలో వరద భీభత్సం సృష్టించడం, ఎందరో మరణించి, నిరాశ్రయులు కావడం తనని కలచి వేసిందని తెలిపాడు. కేరళ బాధితులను ఆదుకునేందుకు కేరళలో విడుదలైన 'గీతగోవిందం' చిత్రం అక్కడ ఎంత షేర్‌ని రాబడుతుందో ఆ మొత్తాన్ని బాధితుల సహాయార్ధం అందజేస్తున్నట్లు ప్రకటించాడు.
మరోవైపు కేరళలో భారీ ఫాలోయింగ్ ఉన్న అల్లుఅర్జున్ అలియాస్ మాలీవుడ్ అర్జున్, అల్లుశిరీష్ వంటి వారు కూడా కేరళ బాధితులకు సహాయం చేయనున్నారని సమాచారం. ఇలా 'గీతగోవిందం' హీరో విజయ్ రూ.5 లక్షల విరాళం ఇస్తే నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రం కేరళ షేర్‌ని విరాళంగా ప్రకటించడం హర్షణీయమనే చెప్పాలి.