విజయ్‌దేవరకొండ... లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి ఎవడే సుబ్రహ్మణ్యం వరకు ఎన్నో చిత్రాలలో నటించినా గుర్తింపురాలేదు. కానీ తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో వచ్చి ‘పెళ్లిచూపులు’ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ చిత్రం ఆయనను స్టార్‌ని చేసింది. ఇక ఇటీవల ఆయన ‘మహానటి’లో ఓ కీలకపాత్ర పోషించి మెప్పించాడు. అయితే పూర్తిస్థాయి హీరోగా ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’ తర్వాత గీతాఆర్ట్స్2 బేనర్‌లో బన్నీవాసు నిర్మాతగా పరశురాం దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘గీతాగోవిందం’ తాజాగా విడుదలైంది. అల్లు అరవింద్ చెప్పినట్లు విజయ్‌దేవరకొండ వంద చిత్రాలలో హీరోగా నటించడం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే ‘గీతాగోవిందం’కు స్టార్ హీరోలతో సమానంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో పాటు సినిమా ఎంతో బాగుంది అనే టాక్ రావడంతో ఇక ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే అమెరికాలో మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమైంది. బెస్ట్ ఓపెనింగ్స్ విషయంలో ఈ చిత్రం ‘అజ్ఞాతవాసి, రంగస్థలం, భరత్ అనేనేను’ తర్వాత నాలుగో స్థానం దక్కించుకుంది. అల్లుఅర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ని కూడా అధిగమించింది.
ఇక విషయానికి వస్తే తెలుగులో రాజమౌళి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన చిత్రాలంటే ప్రజల్లో నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దర్శకదిగ్గజం జక్కన్న ఓ చిత్రం గురించి పొగిడాడంటే అందరు ఆ చిత్రం చూడాలని భావిస్తారు. ఇక ‘గీతా గోవిందం’ గురించి తాజాగా రాజమౌళి మాట్లాడుతూ, సినిమా చూసి బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాను. విజయ్‌దేవరకొండ నుంచి ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత చిత్రమే ఈ విధంగా ఉంటుందని ఊహించలేకపోయాను. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత ఈ చిత్రం చేయాలని విజయ్ నిర్ణయించుకోవడం బెస్ట్ చాయిస్‌గా, బెస్ట్ డెసిషన్‌గా నేను భావిస్తున్నాను. తను ఏం చేస్తున్నాడో విజయ్‌కి బాగా తెలుసు. ఈ చిత్రం సరదా సన్నివేశాలతో ఉంది. పరశురాం దీనిని ఎంతో చక్కగా తెరకెక్కించాడు అంటూ ట్వీట్ చేశాడు. ఇక పరుశురాం మాట్లాడుతూ.. ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందే నేను విజయ్‌తో ఓ చిత్రం చేయాలని భావించాను. కానీ ఆయనతో నటించడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. 25మంది హీరోయిన్లు ఆయనను వద్దన్నారు.. అని తెలిపాడు. అలా వద్దన్న హీరోయిన్లే ఇప్పుడు విజయ్ కోసం క్యూ కట్టడం ఖాయమనే చెప్పాలి.