మెగాస్టార్ చిరంజీవి-టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘సై..రా..నరసింహారెడ్డి’. ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న చిత్రం కూడా ఇదే. ఇక దీనిని చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తమ హోమ్ బేనర్ అయిన కొణిదెల ఆర్ట్స్‌లో తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవితో పాటు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్-తమిళ లేడీ సూపర్‌స్టార్ నయనతార-కోలీవుడ్ యంగ్ స్టార్ విజయ్‌సేతుపతి, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, తమన్నా వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తోంది. ఇక కొణిదెల నిహారిక, జగపతిబాబులు కూడా ఇందులో కీలకమైన పాత్రలను చేస్తున్నారు. ఎన్నో అవాంతరాల మద్య ఈ చిత్రంలోని కీలకమైన యుద్ద సన్నివేశాలను కేవలం 35రోజుల్లో పూర్తి చేయడం విశేషం. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికి కేవలం మోషన్‌టైటిల్‌తోపాటు అమితాబ్‌బచ్చన్, చిరంజీవి, నయనతార ఉన్న ఫొటోని బిగ్‌బి అమితాబ్ పోస్ట్ చేశాడు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర కావడంతో ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఈ చిత్రం యూనిట్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం అయిన ఆగష్టు22 కంటే ఒకరోజు ముందు అంటే ఆగష్టు21న ఉదయం 11.30 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్‌టీజర్‌ని విడుదల చేయనున్నారని ఉంది. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి బర్త్‌డే మెగాభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ అయితే ఆయన నటిస్తున్న ‘సై...రా...నరసింహారెడ్డి’ టీజర్ విడుదల ఫ్యాన్స్‌కి మరో కిక్ ఇవ్వనుండటం విశేషం. ఇలా మెగాభిమానులకు రెండు రోజుల వ్యవధిలో రెండు డబుల్ థమాకాలు రానున్నాయని చెప్పవచ్చు. ఇక ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్‌లో రూపొందుతున్న చిత్రం ఇదేనని, ఈ చిత్రం కూడా ‘బాహుబలి’లాగానే సంచలన విజయాలు సాధించడం ఖాయమని మెగాభిమానులు అంటున్నారు.