అన్ని జోనర్ చిత్రాలలోకి చారిత్రాత్మక చిత్రాలను తీయడం చాలా కష్టం. ‘బాహుబలి’ వంటి కల్పిత గాధలను తీయవచ్చేమోగానీ చారిత్రక చిత్రాలను తీయాలంటే మాత్రం ఎంతో శ్రమ, కృషి, పరిశోధన, సినిమా లోకేషన్స్ నుంచి కాస్ట్యూమ్స్, నాటి సన్నివేశాలను సాంకేతిక పరిజ్ఞానంతో అందంగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో ఉంటాయి. ఏమాత్రం తప్పుగా తీసినా చరిత్రను వక్రీకరించినట్లు అయి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక విషయానికి వస్తే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని 70రోజుల్లో అత్యద్భుతంగా తాననుకున్న అవుట్‌పుట్‌తో పెద్దగా భారీ బడ్జెట్ లేకుండానే తీసి బ్లాక్‌బస్టర్ కొట్టడం క్రిష్ జాగర్లమూడికే సాధ్యమైంది. ఇక ఈయన ఇప్పుడు తెలుగులో మరోసారి బాలకృష్ణ హీరోగా ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా ‘ఎన్టీఆర్’ తీస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని స్వాతంత్య్రదినోత్సవకానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి.
అచ్చు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌లా కాషాయ దుస్తులలో ఎడమచేతిని ఎత్తి తీసిన లుక్ అద్భుతంగా ఉంది. బహుశా ముందుగా అనుకున్న దర్శకుడు తేజ కూడా ఆ స్థాయిలో మెప్పించలేడేమోనని ఫస్ట్‌లుక్ చూసిన తర్వాత అర్ధమవుతోంది. ఇక ఈయన ప్రతిభను గమనించి కంగనారౌనత్ పట్టుబట్టి మరీ మరో చారిత్రక చిత్రమైన ‘మణికర్ణిక’ (ది క్వీన్ ఆఫ్ ఝూన్సీ) ఫస్ట్ అఫీషియల్ లుక్‌ని కూడా 72వ స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా విడుదల చేశారు. అంటే దాదాపు ఒకేరోజు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న రెండు చారిత్రక చిత్రాలు లుక్స్ విడుదల అయ్యాయి.
ఇక ‘మణికర్ణిక’ విషయానికి వస్తే సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ వారిని ఝూన్సీ లక్ష్మీభాయ్ గడగడలాడించినట్లుగా ఈ స్టిల్ ఉంది. తన కుమారుడిని వీపుకు కట్టుకుని రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుని ఆంగ్లేయులపై సింహగర్జన చేస్తున్న ఈ ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్ రచన చేయడం మరో విశేషం. హిందీ, తెలుగుతో పాటు ఈ చిత్రం పలు భాషల్లో వచ్చే ఏడాది జనవరి 25న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానుంది. ఇక క్రిష్‌కి ఇది రెండో బాలీవుడ్ చిత్రం. గతంలో ఆయన తమిళ ‘రమణ’, తెలుగు ‘ఠాగూర్’లకు రీమేక్‌గా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ అనే చిత్రం చేసిన సంగతితెలిసిందే.