ప్రస్తుతం యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌కి కాస్త దూరంలో ఉన్నాడు. తాజాగా విడుదలైన 'గీతగోవిందం' కూడా హిట్ అయితే ఆయనకు స్టార్‌డమ్ వచ్చినట్లే లెక్క. ఈయన తాజాగా మాట్లాడుతూ, పాడటం అంటే నాకిష్టం. పాడటాన్ని ఎంతో ఆస్వాదిస్తాను. నాకు స్వతహాగా గాయకులు, పాప్‌స్టారంటే బాగా ఇష్టం. అంతమంది ముందు పాడటం ఎంతో గొప్పగా అనిపించేది. ఒకటో తరగతి చదివే రోజుల్లో మ్యూజికల్ క్లాస్‌లలో కూర్చోబెట్టారు. బయట నాతోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే.. ఈ సరిగమలు నాకు అవసరమా? అనిపించేది. ఆ క్లాస్‌లకు డుమ్మా కొట్టేవాడిని. కొన్నిరోజులైనా ఆ క్లాస్‌కి వెళ్లి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది.
'గీతగోవిందం'లో నేను పాడిన పాట 45 నిమిషాలలో పాడాను. నాకు ఎలా వచ్చో అలాగే పాడాను. ఒకరోజు సాధన చేసి పాడినా అంతకంటే బాగా రాదు. పర్‌ఫెక్ట్‌గా పాడాలంటే ఆరు నెలలు ప్రాక్టీస్ చేయాలేమో? పైగా ఓ కుర్రాడు సరదాగా పాడే పాట ఇది. సంగీతం టచ్ ఉన్న పాట పాడమంటే కష్టమయ్యేది. నువ్వు పాడితే మజా వస్తుంది అనడంతో పాడాను. బాగోలేదు అనుకుంటే తీసేద్దామని కూడా చెప్పాను. నీ పాట బాగోలేదు. చెత్తగా ఉంది అంటే ఓకే. 'అరె.. నువ్వు ఇక పాడకు' అంటే మాత్రం ఒప్పుకోను. నేనెందుకు పాట పాడకూడదు? మా అమ్మనాన్న చెబితేనే వినను. నువ్వెవడివి నాకు చెప్పడానికి అనిపిస్తుంది. ఒకరిపై కామెంట్లు చేయడం సులభం.
నేను కూడా ఇంట్లో కూర్చుని ఇలాంటి సెటైర్లు వేసేవాడిని. 'గీతగోవిందం'ని అర్జున్‌రెడ్డితో పోల్చకూడదు. అర్జున్‌రెడ్డి చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎవరికి నచ్చుతుందో మాకు తెలుసు. 'గీతగోవిందం' అందరికీ నచ్చే చిత్రం. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శకుడు పరశురాంకే చెందుతుంది. ఆయన ఏమి చెప్పాడో అదే నేను చేశాను. తనకి ఏమి కావాలో అర్ధం చేసుకుని నటించాను.. అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.