తెలుగులో సీనియర్ స్టార్స్‌లో చిరంజీవి 150 చిత్రాలను, బాలకృష్ణ 100కు పైగా చిత్రాలను చేశారు. ఇక మిగిలిన ఇద్దరు సీనియర్స్ అయిన నాగార్జున, వెంకటేష్‌ల విషయం తెలియాల్సివుంది. త్వరలో తను గెస్ట్‌గా నటించిన పాత్రలను కలపాలా? వద్దా? అని ఓ నిర్ణయం తీసుకుని తన వందో చిత్రం గురించి చెబుతానని కింగ్ నాగార్జున తెలిపాడు. ఈ విషయంలో తన లెక్కలు తనకి ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు విక్టరీ వెంకటేష్ 70కి పైగా చిత్రాలలో నటించాడు. మరి ఈయన సెంచరీ చేస్తాడా? లేదా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.
ఇక వెంకటేష్ హీరోగా మారడం యాదృచ్చికంగా జరిగింది. విదేశాలలో చదువు పూర్తి చేసుకుని వచ్చి తన తండ్రి డి.రామానాయుడుకి చెందిన రామానాయుడు స్టూడియోస్, నిర్మాణ బాధ్యతలను సురేష్‌బాబు, వెంకటేష్‌లు చూసుకునేవారు. ఇక రామానాయుడు నాడు కృష్ణ, శోభన్‌బాబులతో ‘ముందడుగు’ అనే మల్టీస్టారర్ తీసి మంచి హిట్ కొట్టాడు. తదుపరి చిత్రం చేయమని కృష్ణని అడిగితే ఓకే.. కానీ పరుచూరి బ్రదర్స్ రచయితలుగా, రాఘవేంద్రరావు దర్శకుడైతే చేస్తానని చెప్పాడు. వారిద్దరిని రామానాయుడు అందుకు ఒప్పించాడు. కానీ కృష్ణ మాత్రం తనకు వేరే నిర్మాతతో కూడా కమిట్‌మెంట్ ఉందని, కాబట్టి రామానాయుడు ఆ నిర్మాతతో కలిసి భాగస్వామ్యంలో చిత్రం చేయాలని పట్టుబట్టాడు. అందుకు రామానాయుడు ఒప్పుకోలేదు.
మరోవైపు చిరంజీవి, బాలకృష్ణ అందరు బిజీనే. ఈ సందర్భంలో పరుచూరి బ్రదర్స్ వెంకటేష్‌బాబుని హీరోగా చేయవచ్చు కదా...! అని రామానాయుడుకి సలహా ఇచ్చారు. రామానాయుడు దానికి ఓకే చెప్పి రాఘవేంద్రరావుని అడిగితే, పరుచూరి బ్రదర్స్ వంద రోజులు ఆడే సినిమా కథను ఇస్తే రెడీ అని తెలిపాడు. అలా విక్టరీ వెంకటేష్ హీరోగా మారి, మహిళ, ఫ్యామిలీ, మాస్, క్లాస్ వంటి అందరి ఆదరణ చూరగొన్నాడు. ఇక ఈయన సినిమా ఫీల్డ్‌లోకి ప్రవేశించి 32 ఏళ్లు అయింది.
ఈ సందర్భంగా వెంకటేష్ ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. నేను తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. ఆగష్టు14, 1986న నా మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’ విడుదల అయింది. ఆ రోజే నేను నటునిగా జన్మించాను. గత 32ఏళ్లుగా మీ ఆదరాభిమానాలను పొందుతూనే ఉన్నాను. అందుకు నేనెంతో అదృష్టవంతుడిని. నేను నా సినీ ప్రయాణంలో మరో అడుగుముందుకు వేయనున్నాను. దీని ద్వారా మీ అందరికీ మరింత దగ్గర అవుతాను. త్వరలోనే మీకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానని తెలిపాడు. ఇంతకీ ఆయన వేసే మరో అడుగుఏమిటి? ఆయన ఇచ్చే సర్‌ప్రైజ్ ఏమిటి? అనే విషయం కూడా తెలిసిపోయింది. వెంకీ తన అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఇన్‌స్ట్రాగ్రమ్‌లోకి వచ్చారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్2’(ఫన్ అండ్ ఫస్ట్రేషన్), బాబి అలియాస్ రవీంద్ర దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి రెండు మల్టీస్టారర్స్ చేస్తుండటం విశేషం.