కళకు, కళాకారులకు ప్రాంత, మత, కుల, భాషా బేధాలు ఉండవు. అయినా కొందరు పరభాషా నటులు ఎంత కాలం టాలీవుడ్‌లో ఉన్నా కూడా వారికి తెలుగు మాట్లాడటం చేతకాదు. తమ డబ్బింగ్ తాము చెప్పుకోలేరు. డబ్బింగ్‌పైనే ఆధారపడుతూ ఉంటారు. ఇది మాత్రం తప్పు. నటనలో ఆహార్యం, వాచకం వంటివి కూడా ఒక భాగం. అందుకే ఏ భాషలో నటించినా ఆ భాషపై శ్రద్దపెట్టి డబ్బింగ్ చెప్పుకునే వారే నిజమైన నటులు. ఏకంగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతికిరణం’ చిత్రం కోసం మలయాళీ, అందునా ముస్లిం అయిన మమ్ముట్టి పట్టుబట్టి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. కానీ రాజశేఖర్, సుమన్ వంటి వారు ఇప్పటికీ అరువు గొంతులపై ఆధారపడుతూ ఉంటారు.
ఇక ఇటీవల మలయాళం, తమిళం నుంచి దిగుమతి అయిన సాయిపల్లవి, కీర్తిసురేష్, సమంత, ఇతర భాషల నుంచి వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్, రాశిఖన్నా వంటివారు కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పి మార్కులు కొట్టేస్తు ఉండటం విశేషం. ఇక బుల్లితెర యాంకర్లలో టాప్‌గా చెప్పుకోదగిన సుమ వంటి వారు చాలా అరుదు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినా.. తెలుగు వారి కంటే అనర్ఘళంగా మాట్లాడుతుంది. ఇక యాంకర్లలో శిల్పాచక్రవర్తితోపాటు కరుణ భూషణ్ కూడా అదే కోవలోకి వస్తుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు నేను ‘విహారి’ అనే కార్యక్రమం చేశాను. నాకు తెలుగు అసలేరాదు. స్క్రిప్ట్ చూసుకుని చెప్పగలుగుతాను అని ముందుగానే నిర్మాతకు చెప్పాను. నేను యాంకరింగ్ చేయడం అదే మొదటిసారి. అంతకు ముందే నాకెలాంటి అనుభవం లేదు. ఇక ఆ షో షూటింగ్ సమయంలో దర్శకుడు నాకు క్లాస్ పీకాడు.
నీకు తెలుగురాదు.. యాంకరింగ్ తెలియదు. నువ్వేమైనా స్టార్‌ని అనుకుంటున్నావా? అంటూ ఏవేవో అన్నాడు. నాకు తెలుగు తెలియదని, కొన్ని పదాలు పలకలేనని ముందుగానే చెప్పాను. అలాంటిది కష్టమైన పదాలను ప్రామ్టింగ్ లేకుండా నేను ఎలా చెప్పగలను? ఒకవేళ నేను పనికిరాననుకుంటే తీసివేయండి... అని అన్నాను. అయినా కష్టపడి ఇప్పటికీ నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. అది నేను గర్వంగా భావిస్తాను. ఆ దర్శకుడు మాత్రం అప్పటినుంచి ఇప్పటివరకు నాకు ఎక్కడా కనిపించలేదు. నా టాలెంట్‌తో ఆయనకు నేను సమాధానం చెప్పాననే భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.