ఒకప్పుడు తెలుగు స్టార్స్ పెద్దగా ఏ విషయానికి స్పందించేవారు కాదు. ఈ విషయంలో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ మాత్రం ముందుండేవారు. రజనీకాంత్, కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ వంటి వారు తమ అభిమానులు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించే వారు. ఇక తమ అభిమానులు మృతి చెందిన కూడా వీరు ఎంతో ఎమోషనల్‌గా ఫీలయ్యేవారు. విజయ్, కార్తి, లారెన్స్ వంటి వారు ఇటీవల తమ అభిమానులు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల్లా వెక్కివెక్కి ఏడ్చారు. ఇక అజిత్, రజనీకాంత్ వంటివారైతే ముందు మీ తల్లిదండ్రులు దైవంతో సమానం. మాపై ఇష్టం ఉంటే మా సినిమాని ఒకసారి చూడండి. నచ్చితే మరోసారి చూడండి.. అంతేగానీ మా కోసం మీ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడం, కటౌట్లు, బేనర్లు కడుతూ కరెంట్‌షాక్‌లు, ఎత్తు నుంచి పడిపోవడం వంటి పనులు చేయవద్దని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అదే మార్పు తెలుగు స్టార్స్‌లో కూడా వస్తోంది.
పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ నుంచి నితిన్ వరకు తమ అభిమానుల కోరిక మేరకు వ్యాధులతో బాధపడుతున్న అభిమానులను కలవడం, వారి కోరిక ప్రకారం వారితో ఫొటోలు దిగడం, ఆర్ధిక సాయం చేయడం వంటివి చేస్తున్నారు. ఇటీవలే ‘బుల్లి మగధీర’ విషయంలో కూడా రామ్‌చరణ్ ఎంతో కలతకి గురయ్యాడు. ఇక విషయానికి వస్తే తాజాగా యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కూడా తన చిన్నారి అభిమాని కోసం ఓ మంచి పని చేశాడు.
మదన్‌రెడ్డి అనే చిన్నారి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో నాకు బాహుబలి ప్రభాస్‌ని చూడాలని ఉంది అని ప్లేకార్డ్ రాసి తన తల్లిదండ్రులతో ఫొటో దిగాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని గమనించిన ప్రభాస్ వెంటనే స్పందించాడు. సదరు బాలుడి వివరాలను తెలుసుకుని ఆ బాలుడిని కలిశాడు. తన అభిమాన హీరో తన ముందుకు రావడంతో ఆ బుల్లి అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మదన్‌తో కొద్దిసేపు గడిపిన ప్రభాస్ ఆ చిన్నారితో ముచ్చటించాడు. సరదాగా అతనితో ఫొటో దిగాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు ‘సాహో’ చిత్రం షూటింగ్‌లో తలమునకలై ఉన్న ప్రభాస్ ఈ బాలుడి కోసం విలువైన సమయాన్ని కేటాయిండం హర్షించదగ్గ విషయమనే చెప్పాలి.