‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’ చిత్రాలతో విజయ్‌దేవరకొండకి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయన నటన, మాటలు, చేష్టలు అన్నీ యూత్‌ని ఎంతగానో అలరిస్తున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’తో ఆయన స్టార్‌డమ్‌కి దగ్గరైపోయాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ, నా స్టార్‌డమ్ గురించి గుర్తించేంత సమయం నాకులేదు. అన్ని చకచకా జరిగిపోతున్నాయి. కార్లో వస్తుంటే రోడ్డు పక్కన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అది నువ్వేరా? అని నా మనసు ఆనందంతో పొంగిపోతోంది. నేనే కాదు... ఆ రోడ్డుపై వెళ్లే అందరు ఆ ఫ్లెక్సీలోని నన్ను చూస్తున్నారు కదా...! అనిపిస్తుంది.
వాస్తవానికి ఇవ్వన్నీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అలవాటు పడటానికి సమయం పడుతుంది. ఒక్కటైతే నిజం.. ప్రస్తుతం నా కెరీర్ నా చేతిల్లో లేదు. అది ఎటువైపు వెళ్తుంటే అటు నేను పరుగెడుతున్నాను. ఈ కన్‌ఫ్యూజన్ నాకు చిన్ననాటి నుంచి ఉంది. తప్పులు చేస్తే ఓకే. అవి చాలా సహజం, నా నిర్ణయాల వల్ల తప్పులు జరిగితే వాటిని స్వీకరించడానికి నేను సిద్దం. వాటి ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరిస్తాను. కానీ ఎవరో చేసిన తప్పును నాకు అంటగడితే మాత్రం ఒప్పుకోను. నాకు ఎప్పుడో ఒకప్పుడు స్టార్‌డమ్ వస్తుందని తెలుసు. కానీ దానితో నేనేం చేయాలి? అనేది సందేహం. అది ఒక వస్తువు మాత్రమేనని నేను భావిస్తాను.
నా పని నేను చేస్తున్నా. దానికో స్పందన వస్తోంది. నచ్చిన పని కొత్తగా చేయడమే నాకిష్టం. స్టార్‌డమ్, ఫేమ్, పేరు ఇవ్వన్నీ శాశ్వతం కాదు. ఇవి తాత్కాలిక విషయాలు. నాకంటూ ఓ గుర్తింపు ఉండటం వల్ల నేనేమి చేసినా ప్రజల్లోకి వెళ్తోంది. కానీ జీవితంలో ఏదో ఒకరోజు ఓ పని చేయాలని అనుకున్నాను. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు నా స్నేహితునితో కలిసి వస్త్ర వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాం. దానికి ‘లావా’ అనే పేరు కూడా పెట్టాం. అది ఇప్పుడు వర్కౌట్ అయింది. అందరికీ చాలా ఆలోచనలు ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి ఓ వేదిక కావాలి. సినిమాల ద్వారా నాకు ఆ వేదిక లభించింది.