ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా దేశం మొత్తం మరీ ముఖ్యంగా లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. గెలుపు గుర్రాలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఏ నాయకునికి పట్టుంది? సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరి మీద వ్యతిరేకత ఉంది? ఏ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెడితే లాభం? వంటి విషయాలలో ఇటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, అటు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌లు ఇప్పటికే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. మరోవైపు వివిధ మీడియా సంస్థలు, లగడపాటి రాజగోపాల్ వంటి వారు కూడా వ్యక్తిగత సర్వేలను చేయించుకుంటూ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నారు. ఓ వైపు జగన్ పాదయాత్ర, పవన్ యాత్ర, చంద్రబాబు యాత్రలు కూడా ఎన్నికల సమరాన్ని మరిపిస్తున్నాయి.
ఇక జగన్‌కి రాజకీయ సలహాదారుగా గతంలో బిజెపికి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇదే పనిలో తలమునకలై ఉన్నాడు. నిజానికి ప్రశాంత్‌కిషోర్ వంటి వారికి ఉత్తరాదిలోని ప్రజలు, వారి మనోభావాలపై పట్టు ఉందేమో గానీ దక్షిణాదిలో అందునా రాజకీయంగా బాగా చైతన్యవంతులైన తెలుగు రాష్ట్రాలలోని ప్రజల నాడి తెలుసుకోవడం ఎవరి తరము కాదనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఏయే ప్రాంతాలలో ఏయే నాయకులకు టిక్కెట్లు ఇస్తే బాగుంటుంది? అనే విషయంలో ప్రశాంత్‌కిషోర్ అలియాస్ పీకే ఆల్‌రెడీ సర్వే చేసి జగన్‌కి రిపోర్ట్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల ప్రమేయం, వారికి తెలియకుండానే జనాలలో పర్యటించి ప్రజల మనోభావాలను పీకే సేకరించినట్లు చెబుతున్నారు. ఈ సర్వే నివేదిక ప్రకారమే జగన్ పలువురి నేతలకు పరోక్ష సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
సర్వే ఆధారంగా తాను పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాలలో పార్టీ నేతలతో జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని తొలుత జగన్ భావించాడు. అయితే వివిధ కార్యక్రమాల వల్ల ఇవి వాయిదా పడుతూనే వస్తున్నాయి. త్వరలో నేతలతో జగన్ వ్యక్తిగత సమావేశాలను నిర్వహించనున్నాడని సమాచారం. మరోవైపు పీకే టీమ్ సర్వే జరిపిన విషయం వాస్తవమేనని, అయితే ఆ సర్వేలో ఎవరి పేర్లు ఉన్నాయో మాత్రం తెలియదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలలో, నాయకులలో ఈ సర్వే గుబులు రేపుతోంది. పోటీలో ఉన్న అందరు దీనిపై ఎలాగైనా ఆరా తీయాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రానున్న ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న పలువురు తమ ప్రాంతంలో పీకే టీమ్ ఏ నివేదిక అందించింది? అనే విషయం తర్జనభర్జనలు పడుతున్నారు. మరి ఇదే పీకే నంద్యాల ఉప ఎన్నికలతో పాటు పలు చోట్ల విఫలమైన సంగతి అందరీకీ తెలిసిందే. ఈ పీకే బిజెపి మనిషని, బిజెపి నేతలే జగన్‌కి పీకేని పెట్టుకోమని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.