త్రివిక్రమ్ తీసిన 'అత్తారింటికి దారేది' తరహాలోనే కంపెనీ సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశాల సన్నివేశాలు, ఇక పవన్‌ని కూడా 'అత్తారింటికి దారేది'లో లాగానే చూపించడం 'అజ్ఞాతవాసి' ఫ్లాప్‌కి ముఖ్య కారణమని, ఇందులో హీరో విలన్లను వేటాడకుండా ఏదో ఎంటర్‌టైన్ చేస్తూ ఉండటం ఈ చిత్ర పరాజయానికి ప్రధాన కారణంగా సీనియర్ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల 'అజ్ఞాతవాసి'ని స్కానింగ్ చేసి డెత్ రిపోర్ట్ ఇచ్చాడు. మరి త్రివిక్రమ్ ప్రస్తుతం మరలా అదే హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం చేస్తున్నాడు. 'అజ్ఞాతవాసి'ని చూసి అసలు ఎవ్వరూ ఇది త్రివిక్రమ్ తీశాడంటే నమ్మలేకపోయారు. పవనే పట్టుబట్టి అలా తీయించి ఉండాలి? లేదా మరెవ్వరో త్రివిక్రమ్ పేరుతో ఘోస్ట్‌గా డైరెక్షన్ చేసి ఉంటారనే విధంగా టాక్ వచ్చింది. గతంలో ఎన్నడూ, ఏ దర్శకుడి మీద రానన్ని విమర్శలను త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి'తో మూటగట్టుకున్నాడు. ఆయన కెరీర్‌లోనే ఇదో పెద్ద కుదుపుగా చెప్పాలి.
ఇక ఎన్టీఆర్‌తో ఆయన తీస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం టైటిల్ ఫస్ట్‌లుక్‌ని చూస్తే 'టెంపర్'లోని ఎన్టీఆర్ గుర్తుకు వచ్చాడు. ఇక క్లాస్ క్యారెక్టర్‌లో మాత్రం ఫ్రెష్‌గానే ఉన్నాడు. పూజాహెగ్డే, ఇషారెబ్బా హీరోయిన్లుగా కనిపించనున్న ఇందులో ఎన్టీఆర్ రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో ఒక విధంగా, క్లాస్ లుక్‌లో మరో విధంగా రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్నాడని ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా సాగుతోంది. తమన్ కూడా ట్యూన్స్‌ని రెడీ చేశాడని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో దీనిని విజయదశమి కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇక దీని మొదటి టీజర్‌ని రేపు అంటే స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఉదయం 9గంటల సుమూర్తంలో విడుదల చేస్తామని ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో కూడా ఎన్టీఆర్ చీకటిలో మనిషి ముఖం వంటివి స్పష్టంగా కనిపించకుండా 'అజ్ఞాతవాసి'లానే కనిపిస్తుండటం విశేషం. మరి ఈ సారైనా మాటల మాంత్రికుడు మ్యాజిక్ చేస్తాడా? ఎన్టీఆర్‌తో మ్యూజికల్ చైర్ ఆడిస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది...!