పైరసీ విషయంలో ఏ సినిమా రంగం కూడా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. ఒక హీరో సినిమాని ప్రత్యర్ధులు లీక్ చేస్తే, వారి అభిమానులు పక్క హీరోల సినిమాలను లీక్ చేసేందుకు సిద్దపడుతుండటం విచారకరం. ఇక నిర్మాత దర్శకులు, హీరోలు కూడా తమ సినిమా విడుదలయినప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో పైరసీనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' నుంచి 'బాహుబలి, 2.ఓ', ఇటీవల విజయ్‌దేవరకొండ 'గీతగోవిందం', ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ, సై..రా... నరసింహారెడ్డి' వరకు పలు చిత్రాల సీన్స్ లేదా ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నా ఫొటోలైనా లీక్ అవుతూనే ఉంటున్నాయి. ఇందులో బయటి వారి కంటే ఇంటి దొంగలే కీలకపాత్రను పోషిస్తున్నారని పలుసార్లు నిరూపితం అయింది. విశాల్ వచ్చిన తర్వాత కోలీవుడ్‌లో పైరసీ, లీకేజీల మీద తీవ్ర చర్యలు తీసుకుంటూనే ఉన్నాడు. కానీ దానికి కూడా ఎవ్వరూ భయపడటం లేదు. గూండా యాక్ట్ పెట్టడం తప్ప దీనిని మరో విధంగా అరికట్టే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఈ షాక్ విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో 'తుపాకి, కత్తి' తర్వాత వస్తున్న హ్యాట్రిక్ చిత్రం 'సర్కార్'కి తగిలింది. ఇందులో ఓ పాటకు సంబంధించి 21 సెకన్ల వీడియో లీక్ అయింది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో చిత్రీకరించిన ఈ పాట 21 నిమిషాల నిడివి విడుదలై నెట్టింట్లో వైరల్‌గా మారడంతో విజయ్ అభిమానులు అజిత్ ఫ్యాన్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవం మరోలా ఉంది. శోభి కొరియోగ్రఫీ నిర్వహించిన ఈ పాటలో విదేశీ డ్యాన్సర్లు కూడా డ్యాన్స్‌లు చేశారు. దీంతో ఈ వీడియో లీక్‌లో విదేశీ డ్యాన్సర్ల హస్తం ఉందా? అనే దిశగా అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను వెనుక వైపు నుంచి చిత్రీకరించినట్లు అర్ధమవుతోంది.
తమిళ రాజకీయ నాయకుడు కళకరుప్పయ్య ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో మురుగదాస్, విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి' చిత్రం తెలుగులోకి డబ్ అయింది. 'కత్తి' చిత్రాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్ 150'గా రీమేక్ చేశాడు. ఇక సర్కార్ చిత్రాన్ని కూడా అది సాధించే ఫలితం బట్టి రీమేక్ చేయాలా? డబ్ చేయాలా? అనేది డిసైడ్ చేస్తారని అంటుంటే, తెలుగు మార్కెట్‌పై కన్నేసిన విజయ్ ఆల్‌రెడీ దీనిని అదే పేరుతో డబ్ చేయడానికి సంసిద్దుడు అవుతున్నాడు.