మతాలు, కులాలు అనేవి మానవులు, మన సమాజం ఏర్పరచుకున్నవే. నిజానికి మానవులంతా దేవుని దృష్టిలో సమానమే. అందుకే షిర్డి సాయిబాబా 'సబ్‌కా మాలిక్ ఏక్' అన్నారు. రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా అందరు ఒక్కటే, ప్రతి మతం చెప్పేది ఒకటే. ఎదుటి వారికి సాయం చేస్తే దైవానికి సేవ చేసినట్లే. మానవసేవే మాధవసేవ అని అందుకే అంటారు. రామాయణం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటివన్నీ ఒకే విషయాన్ని చెబుతాయి. ఎదుటి వారిని ఏడిపించమని, ఉగ్రవాదులుగా మారమని ఏ మత గ్రంధం చెప్పదు. ఇక బైబిల్ విషయానికి వస్తే అందులో ఏసుక్రీస్తు ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. 'తనను తాను తగ్గించుకున్న వాడు.. హెచ్చింపబడును' అనేది అందులో ఒకటి.
ఇక విషయానికి వస్తే తాజాగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ బైబిల్‌లోని ఈ వాక్యాన్ని చెబుతూ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును.. అని నేను చిన్నతనంలో బైబిల్ చదివి నేర్చుకున్నాను. ఆ వాక్యాలను తూచా తప్పకుండా పాటిస్తాను. నేను ఏసు ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను. సర్వమతాలు సమానమని నేను నమ్ముతాను. ప్రతిసారి నేను 'జైహింద్' అంటాను. అలా అనాలని చెప్పి, నాకు నేర్పించింది ఓ క్రిస్టియన్ టీచర్. ఆమె ఇప్పుడు లేదు. ఆమెని నేను 'అమ్మా' అంటాను. నాకు పాఠాలతో పాటు దేశభక్తిని కూడా బోధించిన మహాత్మురాలు ఆమె. జీసస్ గొప్పతనం, ఆయన సహనం, క్షమాగుణం వంటి వాటి గురించి ఆ తల్లి నాకు చెప్పింది.
చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బైబిల్ ఉండేది. సర్వమతాలను, సర్వమత గ్రంథాలను మనస్ఫూర్తిగా గౌరవించే సంస్కారం ఉన్న కుటుంబం మాది. అందుకే ప్రతి ఒక్కరి సమస్యలను, బాధలను నేను అర్ధం చేసుకోగలను. ఏ మహాత్ముడు బోధించినా మానవత్వం గురించే.. ఆ మానవత్వానికి మహాత్ముడు అయిన జీసస్‌ని అందరు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు.