ఎప్పుడైతే టాలీవుడ్ నుంచి 'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలు వచ్చి దేశ, విదేశాలలో సంచలనం సృష్టించాయో నాటి నుంచి మనదేశంలోని బాలీవుడ్, కోలీవుడ్ మూవీమేకర్స్‌కి 'బాహుబలి'నే టార్గెట్ అయింది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లు కలిసి నటిస్తున్న '2.ఓ' కూడా ఇంత ఆలస్యం కావడానికి కారణం కేవలం బాహుబలిని మించిన నిర్మాణ విలువలు, సాంకేతి అంశాలు, గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ వంటివి ఉండాలని శంకర్ పట్టుబట్టడంతోనే ఈ చిత్రం ఇంకా సాగుతూనే ఉంది. నవంబర్‌లో విడుదల అన్నారు. అదే శంకర్ అనుకున్నట్లుగా 'బాహుబలి'ని మించిన విధంగా చిత్రం అవుట్‌పుట్ రాకపోతే మరోసారైనా ఆ చిత్రం విడుదలను శంకర్ ఖచ్చితంగా వాయిదా వేస్తాడు. ఇక 'బాహుబలి' వచ్చిన తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ భారీ బడ్జెట్‌తో అతిలోక సుందరి శ్రీదేవి వంటి వారిని పెట్టుకుని తీసిన 'పులి' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక బాలీవుడ్‌లో కూడా 'బాజీరావు మస్తానీ, పద్మావత్'తో పాటు కరణ్‌జోహార్ కూడా బాహుబలిని మించిన చిత్రం తీయాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా 500కోట్ల బడ్జెట్‌తో ఆ తరహా కథతోనే 'తక్త్' చిత్రం మొదలుపెట్టాడు. ఇక శ్రీతేనాండల్ మూవీస్ సంస్థ కూడా బాహుబలి విజయాన్ని చూసి ఓర్వలేక 300కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్‌సి. దర్శకత్వంలో 'సంఘమిత్ర' చిత్రం తీస్తామని ప్రకటించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇందులో నటిస్తుందని భావించిన శృతిహాసన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ అంటూ హంగామా చేసింది. ఆ తర్వాత ఈ చిత్రం నుంచ ఆమె తప్పుకుంది. దాంతో ఈ చిత్రం అసలు ఉంటుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. సుందర్‌సి, ఆయన భార్య ఖష్బూలు మాత్రం ఈ చిత్రం ఉంటుందని, ఇందులో దిశాపఠానీని తీసుకున్నామని ప్రకటించారు. కానీ ఇంతకాలం అయినా ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోయిందట. తాజాగా దిశాపఠానీ మాట్లాడుతూ, దక్షిణాదిలో ఓ భారీ చిత్రం ఒప్పుకున్నాను. అది వర్కౌట్ ఆయ్యేలా కనిపించడం లేదని తెలిపింది. ఆమె ఒప్పుకున్న చిత్రం 'సంఘమిత్ర'నే కావడంతో ఈ చిత్రం ఇక మరుగున పడిపోయినట్లేనని భావించాలి.