భారీ అంచనాల నడుమ నితిన్ - దిల్ రాజు - సతీష్ వేగేశ్న - రాశి ఖన్నాలా కాంబోలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోకే సినిమాకి యావరేజ్ టాక్ రావడంతో.. సినిమా... మెల్లగా పికప్ అవుతుంది అనే ఆశ పోయేలా కనబడుతుంది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసిన చిత్రం కావడంతో.. గురువారం సినిమా విడుదలయ్యింది కాబట్టి ఈ సినిమా కి మొదటి రోజు యావరేజ్ కలెక్షన్స్ వచ్చినప్పటికీ.. శని, ఆదివారాల్లో శ్రీనివాస కళ్యాణం పుంజుకునే ఛాన్స్ ఉండచ్చేమో అనుకుంటున్నారు. కానీ సినిమాకి ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి కూడా ఒకే రకమైన టాక్ రావడంతో.. ఈ సినిమా ఇక పైకి లేచే ఛాన్సెస్ కనబడడం లేదు.
కేవలం పెళ్లి సీన్స్ ని హైలెట్ చేస్తూ పెళ్లి విషయాలతో దొరికినోళ్లకి దొరికినట్టు క్లాస్ పీకడం తప్ప సినిమాలో కంటెంట్ లేదని.. సతీష్ వేగేశ్న శతమానంభవతి సినిమా తీసినట్టుగా శ్రీనివాస కళ్యాణం సినిమా చెయ్యలేకపోయాడని.. కాకపోతే.. శ్రీకాంత్ అడ్డాల లా బ్రహ్మ్మోత్సవం అంత దారుణంగా కాకపోయినా.. శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా బోర్ కొట్టించే సినిమానేనని.. దిల్ రాజు ప్రమోషన్స్ లో చెప్పినట్టుగా సినిమాలో ఎక్కడా కనబడలేదని.. దిల్ రాజు తెలివిగా సినిమాకి పాజిటివ్ పబ్లిసిటి చేయడంతోనే ఆ మాత్రం యావరేజ్ టాక్ వచ్చిందంటున్నారు. అసలైతే నితిన్ గత డిజాస్టర్స్ లై, ఛల్ మోహన్ రంగ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ కూడా ఈ శ్రీనివాస కళ్యాణం సినిమా కి రాలేదంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు.
ఇక ఈ శని, ఆదివారం శ్రీనివాస కళ్యాణం థియేటర్స్ ముందస్తు బుకింగ్ తో కళకళలాడినప్పటికీ.. సోమవారం ఈ సినిమా కి అసలు సిసలైన పరీక్ష మొదలవుతుంది అంటున్నారు. ఇక శ్రీనివాస కళ్యాణం హిట్ అయ్యి.. ఆగష్టు 15 న విడుదలవుతున్న గీత గోవిందం ఎఫెక్ట్ పడుతుందేమో అనుకుంటే ... శ్రీనివాస కళ్యాణం యావరేజ్ అయ్యి విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా మీద హైప్ పెరిగేలా చేసింది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన గీత గోవిందం సినిమా భారీ అంచనాలతో ఆగష్టు 15 బుధవారం థియేటర్స్ లోకి రాబోతుంది. ఆ సినిమా బుధవారం వచ్చేస్తే శ్రీనివాస కళ్యాణం కలెక్షన్స్ డ్రాపవుతాయనుకుంటే... శ్రీనివాస కళ్యాణం సోమవారానికి దుకాణం సర్ధేసేలా కనబడుతుంది.