ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి ఆ పాత్రకు నూటికి రెండొందల శాతం న్యాయం చేసే నటుల్లో యంగ్ యాక్టర్ ప్రియదర్శి ఒకరు. ఈయనకు 'పెళ్లిచూపులు' చిత్రం గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈయన వరుసగా మహేష్‌బాబు 'స్పైడర్', యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 'జైలవకుశ'వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలను చేశాడు. ఇటీవలే మహేష్ గురించి చెప్పుకొచ్చిన ఆయన తాజాగా ఎన్టీఆర్ గురించి క్షుణ్ణంగా చెప్పుకొచ్చాడు.
ఈయన మాట్లాడుతూ, 'జైలవకుశ' చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసే అదృష్టం లభించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేశారు. ఒక పాత్రకి మరో పాత్రకి ఎక్కడా పోలిక ఉండదు. ఈ షూటింగ్ సమయంలో నేను ఎన్టీఆర్ గురించి విన్నది ప్రత్యక్ష్యంగా చూశాను. అదేమిటంటే ఆయన ఏదైనా సీన్ చేసేటప్పుడు ఎంత పెద్ద డైలాగ్‌ని అయినా, ఎంత కష్టమైన డ్యాన్స్ మూమెంట్‌నైనా ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండా చేస్తారని ఆయన గురించి విని ఉన్నాను. ఈ చిత్రం షూటింగ్‌లో అది ఎంత నిజమో అర్ధమైంది. పెద్ద పెద్ద డైలాగ్‌లను కూడా ఒక్కసారి చూసుకుని కెమెరా ముందుకు వచ్చి ఠక్కున చెప్పేస్తారు. ఇంత జ్ఞాపకశక్తి ఉన్న ఆర్టిస్టులు కూడా ఉంటారా? అని ఎన్టీఆర్ గారిని చూసి ఆశ్చర్యపోయాను.
సీన్ చేస్తున్నప్పుడు నటనను ఆయన ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా తక్కువ మందికే సాధ్యం. అంతేకాదు.. సీన్‌ని ఆయన ఎంజాయ్ చేయడంతో పాటు తనతోటి ఆర్టిస్టులను కూడా ఆయన ఎంతగానో ఎంకరేజ్ చేస్తారు.. అని ఎన్టీఆర్‌లోని సుగుణాలను ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.