ఈమధ్య పలు సామాజిక సమస్యల నేపధ్యంలో చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇక మనదేశంలో సామాజిక సమస్య అంటే అన్నదాతల కడుపుకోత, ఆత్మహత్యలే ముందుగా గుర్తుకు వస్తాయి. చిరంజీవి తన 150వ చిత్రంగా తమిళ 'కత్తి'కి రీమేక్‌గా చేసిన 'ఖైదీనెంబర్ 150', ఇక వరుసగా అన్ని సామాజిక రుగ్మతలపై చిత్రాలు తీసే ఆర్.నారాయణమూర్తి 'అన్నదాత సుఖీభవ', తమిళ డబ్బింగ్ 'చినబాబు' ఇలా వరుసగా రైతుల సమస్యలపై ప్రభావవంతమైన సినీ మీడియా దృష్టి కేంద్రీకరిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా 'సై..రా...నరసింహారెడ్డి' చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇది కూడా రైతు సమస్యలపై రూపొందే చిత్రమని, ఇందులో చిరు రైతుగా కనిపిస్తాడని సమాచారం. ఇక బాలకృష్ణ కూడా కృష్ణవంశీతో 'రైతు' చిత్రం తీయాలని భావించి, చివరి నిమిషంలో అది వాయిదా పడింది.
ఇక విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ ప్రస్తుతం పూణెలో ఉంటూ మరాఠి చిత్రాలకు నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంటోంది. త్వరలో ఆమె తెలుగులోకి నటిగా రీఎంట్రీ ఇస్తుందని పుకార్లు వచ్చాయి. కానీ రేణు మాత్రం తాను నటిగా రీఎంట్రీ ఇవ్వడం లేదని, కేవలం దర్శకురాలిగా తెలుగులో చిత్రం చేయనున్నానని ప్రకటించింది. ఇప్పటికే కథ, కథనాలు పూర్తయ్యాయని ప్రస్తుతం సంభాషణలు రాస్తున్నట్లు తెలిపింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కూడా రైతుల సమస్యలు, వారి ఆత్మహత్యల నేపధ్యంలోనే ఉండనుందని తెలుస్తోంది. ఇక ఎన్నో చిత్రాలలో సమస్యలను ప్రస్తావించడం వరకే మన దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. కానీ సమస్యలు అందరికీ తెలుసు. వాటికి పరిష్కార మార్గాలు చూపితేనే ఆయా చిత్రాలకు సార్ధకత ఉంటుంది. రేణుదేశాయ్ దర్శకత్వం వహించే చిత్రంలో రైతుల సమస్యలే కాదు.. వాటి పరిష్కారాలను కూడ సూచిస్తానని రేణుదేశాయ్ చెబుతోంది. ముందుగా రైతుల జీవితాలను దగ్గరగా చూసి, సినిమాను సహజంగా చూపించాలని కోరుకుంటున్నానని, అందుకోసం రైతుల సమస్యలపై అధ్యయనం చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తానని రేణు చెప్పింది.
ఇక ఇటీవల మహారాష్ట్ర రైతులు పెద్ద పాదయాత్ర చేసి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించారు. ఈ స్ఫూర్తితోనే ఆమె ఈ చిత్రం చేయాలని భావిస్తున్నట్లు ఉంది. దీనికోసం ఆమె సిబిఐ మాజీ డైరెక్టర్ జెడిలక్ష్మీనారాయణ నుంచి ఎందరో రైతు సమస్యల మీద అవగాహన ఉన్నవారిని కలవనుందిట. మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తారో వేచిచూడాల్సివుంది...!