బాలీవుడ్‌లో బాలనటిగా ఉంటూ 2003లో 'హవ్వా' అనే చిత్రం ద్వారా హన్సిక వెండితెరకు పరిచయం అయింది. నాలుగేళ్ల పాటు ఈమె పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'కంత్రి', ప్రభాస్ 'బిల్లా'లతో పాటు రవితేజ నుంచి అందరు హీరోలతో కలిసి నటించింది. ఇక ఈమె బొద్దుగా ఉండటంతో బొద్దుగుమ్మలను బాగా ఇష్టపడే కోలీవుడ్‌పై దృష్టి పెట్టి జూనియర్ ఖుష్బూ స్థాయికి ఎదిగింది. ఈమె పోస్టర్ మీద కనిపిస్తే చాలు ఈ చిత్రంలో ఆమెని చూసేందుకు తమిళ తంబీలు క్యూకడతారు.
ఇక ఈమెకి తమిళ అభిమానులు గుడి కూడా కట్టేంతగా పేరు తెచ్చుకుంది. ఇక హన్సిక నటనా కెరీర్ మొత్తం 19 ఏళ్లు దాటి 20వ ఒడిలోకి చేరుతోంది. హీరోయిన్‌గా 15ఏళ్ల కెరీర్ ఆమెది. ఇప్పటివరకు ఈమె 49 చిత్రాలలో నటించింది. ఇందులో ఒక కన్నడ, మరో మలయాళ చిత్రం మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనే కావడం విశేషం. ఇక ఈమె కోలీవుడ్‌కి ధనుష్ హీరోగా నటించిన 'మాపిళ్లై' చిత్రం ద్వారా పరిచయం అయింది. తమిళంలో దాదాపు అందరు యంగ్ స్టార్స్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె తన 50వ చిత్రం చేయనుంది. నేటిరోజుల్లో కూడా రోజుకో హీరోయిన్ పరిచయం అవుతున్న తరుణంలో 50 చిత్రాలలో నటించడం అంటే సామాన్యమైన విషయం ఏమి కాదు.
ఇక తన బర్త్‌డే సందర్భంగా ఈమె తన 50వ చిత్రం విశేషాలు చెబుతానని చెప్పింది. అయితే కరుణానిధి మరణంతో దానిని వాయిదా వేసుకుంది. ఇక త్వరలో తన 50వ చిత్రాన్ని ధనుష్‌తో కలసి ప్రకటిస్తానని తెలిపింది. అంటే కోలీవుడ్‌లో ఆమె మొదటి హీరో అయిన ధనుషే... ఆమె 50వ చిత్రంలో హీరో అని అందరు ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా ఈమె ఓ తెలుగు చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.