ఒకప్పుడు జంతు హింసల విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకునేవి కావు. సర్కస్‌లలో ఏనుగులు, పులులు, సింహాలను హింసించి వాటిచేత రింగ్ మాస్టర్స్ పలు విన్యాసాలు చేయించేవారు. ఇక సినిమాలలో కూడా నాడు పలు జంతువులను హింసించి, వాటిని తెరపై వినోదంగా చూపించేవారు. కానీ నేడు దానికి జంతు ప్రేమికులు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఒప్పుకోవడం లేదు. కృష్ణజింక కేసులో సల్మాన్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలిసిందే.
ఇక విషయానికి వస్తే మహేష్ నటించిన '1' (నేనొక్కడినే) హీరోయిన్ కృతిసనన్ తాజాగా ఓ మేగజైన్‌కి ఫొటో షూట్ ఇచ్చింది. ఇందులో ఆమె టాక్సీడెర్మిడ్ జిరాఫీతో అంటే ప్రాణం లేని జిరాఫీకి రసాయనాలు పూసి నిల్వఉన్న దానితో ఫొటో దిగింది. గోడకి కట్టి ఉన్న జిరాఫీని పట్టుకుంటూ ఫొటోలకు ఫోజులివ్వగా అవి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది కూడా మూగజీవాలను హింసించడమేనని కొందరు ఆమెపై మండిపడుతున్నారు. జంతులను ఎంతో చక్కగా చూపించే మార్గాలున్నాయి. అసలు అభిరుచి లేకుండా చేసిన ఫొటో షూట్ ఇది.
జీవంతో ఉన్నా లేకపోయినా కూడా జంతువులు ఆడుకునే బొమ్మలు కావు. కావాలంటే కృతిసనన్, ఆ ఫొటోషూట్ డైరెక్టర్, ఫొటోగ్రాఫర్లను కూడా అలాగే వేలాడదీయండి.. ఇదేం సృజనాత్మకత అని మండిపడుతున్నారు. దీనిపై ఆ మేగజైన్ స్పందించింది. జంతు హింసకు తాము కూడా వ్యతిరేకమేనని చెప్పగా కృతి మీరు చూసింది నిజం కాదు. నేను జంతు ప్రేమికురాలినేనని తెలిపింది.