ప్రస్తుతం తెలుగు సినీ రంగం మొత్తం జబర్ధస్త్ నుంచి వచ్చిన సప్తగిరి, షకలక శంకర్, మహేష్, ఇతర కమెడియన్స్‌తో నిండిపోయి ఉంది. అలాంటి సమయంలో అంతకు ముందు కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసినా కూడా 'పెళ్లిచూపులు' చిత్రం ద్వారా సరికొత్త కామెడీ, డైలాగ్ మాడ్యులేషన్‌తో కమెడియన్ ప్రియదర్శి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. దాంతో ఆయనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇదే సమయంలో మహేష్‌బాబు మురుగదాస్ డైరెక్షన్‌లో చేసిన 'స్పైడర్' చిత్రంలో మెయిన్ కమెడియన్‌గా ప్రియదర్శికి అవకాశం దక్కింది. నిజంగానే ఇలాంటి అవకాశం ఎంతో తొందరగా ప్రియదర్శిని వెతుక్కుంటూ వచ్చిందనే చెప్పాలి.
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'స్పైడర్' చిత్రం సమయంలో జరిగిన విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, 'స్పైడర్' చిత్రం సమయంలోనే మహేష్‌బాబుని చూశాను. ఆయన ఆశ్చర్యంగా నన్ను చూసి గుర్తుపట్టి ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్‌ప్రెషన్స్‌ని నేను జీవితంలో మర్చిపోలేను. అది చాలు నా జీవితానికి అనిపించింది. 'స్పైడర్' చిత్రం తమిళవెర్షన్ కోసం నేను ఒక డైలాగ్‌ని తప్పుగా పలికాను. దాంతో సెట్లో అందరు నవ్వేశారు. అప్పటి నుంచి నేను కనిపించినప్పుడల్లా మహేష్ ఆ చిత్రంలోని డైలాగ్‌ని చెబుతూ ఆటపట్టించేవాడు. అలాగే 'పెళ్లిచూపులు' చిత్రంలో నా డైలాగ్ మాడ్యులేషన్‌ని చెబుతూ తెగ నవ్వించేవారు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్‌ని తట్టుకోవడం చాలా కష్టం. ఆయన వేసే కౌంటర్స్ చూసి నేనెంతో ఆశ్యర్యపోయాను. ఆయనలో సేవా గుణం కూడా చాలా ఎక్కువే. అయితే ఆ విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఆయన పెద్దగా ఇష్టపడరు.. అని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం సునీల్ మరలా కమెడియన్‌గా ముందుకు వస్తున్నాడు. మరోవైపు 'రంగస్థలం' చిత్రం ద్వారా జబర్దస్త్ మహేష్ మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు ఇతర కొత్త కమెడియన్ల హవా కూడా సాగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రియదర్శి తన ప్రత్యేకతను ఎలా నిలబెట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది....!