అతిలోక సుందరి శ్రీదేవి గారాల పెద్ద కూతురు జాన్వికపూర్. ఈమె హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన మరాఠీ 'సైరత్'కి రీమేక్ అయిన 'ధడక్' చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లక్కీ ప్రొడ్యూసర్ కరణ్‌జోహార్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అటు అభినయం పరంగా, మరోవైపు గ్లామర్ పరంగా కూడా జాన్వి కపూర్ అందరినీ అలరించింది. ఇక ఈమధ్య ఆమె మాట్లాడుతూ, తన మొదటి చిత్రం రీమేక్ చేశానని, కానీ రెండో చిత్రం మాత్రం స్ట్రెయిట్ చిత్రం చేస్తానని చెప్పుకొచ్చింది. ఆమె అనుకున్నట్లే ఓ భారీ బడ్జెట్ చిత్రం ఆమెకి లభించింది. దీనిని అధికారికంగా ప్రకటించడమే కాకుండా టైటిల్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కూడా కరణ్‌జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బేనర్‌లోనే నిర్మిస్తుండటం విశేషం.
'బాహుబలి' సమయం నుంచి అలాంటి భారీ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీయాలని ఉబలాటపడుతోన్న కరణ్‌జోహార్ నిర్మించే ఈ చిత్రం బడ్జెట్ ఏకంగా 500కోట్లు. ఇందులో రణవీర్‌సింగ్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన కరీనాకపూర్, అలియాభట్‌లు నటిస్తున్నారు. మరో హీరోగా విక్కీ కౌశల్‌ని తీసుకున్నారు. ఇతనికి జంటగా జాన్వికపూర్‌ని భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం పేరు 'తక్త్'. అంటే 'సింహాసనం' అని అర్ధం. దీనిని బట్టి ఇది రాజులు, సింహాసనం కోసం చేసే యుద్దాలు గట్రా 'బాహుబలి' తరహాలోనే ఉంటుందని అనిపిస్తోంది.
గతంలో కృష్ణ కూడా 70ఎంఎంలో 'సింహాసనం' చిత్రం స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తానే హీరోగా, జయప్రద, మందాకిని హీరోయిన్లుగా తీశాడు. ఇదే చిత్రాన్ని కృష్ణ బాలీవుడ్‌లో కూడా జితేంద్ర హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి 'తక్త్' అంటే 'సింహాసనం' చిత్రం జాన్వీని నేషనల్ స్టార్‌ని చేస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. కెరీర్ ప్రారంభంలోనే ఆమెకి ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో అవకావం రావడం అదృష్టమనే చెప్పాలి. కాగా ఈ చిత్రం 2020లో విడుదల కానుందని యూనిట్ ప్రకటించింది.