అలనాటి బాలీవుడ్ నటి పూజా దడ్వాల్ ఆరోగ్యం కుదుటపడింది. ఆమె తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో బతికేందుకు పోరాటం చేస్తోందని, ఆమె అత్యంత దయనీయంగా బతుకుతోందని కథనాలు వచ్చాయి. దాంతో సల్మాన్‌ఖాన్ ఆర్ధిక సాయం చేశాడు. ఆమెకి సల్మాన్ సహనటుడు కూడా. ఆమె చికిత్సకు అయ్యే మొత్తాన్ని తన ఫౌండేషన్ ద్వారా ఆయన సమకూర్చాడు. తాజాగా పూజా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు తన ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని ఆమె మీడియాకు స్వయంగా వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు నా అనుభూతిని వర్ణించలేను. మార్చి 2న హాస్పిటల్‌లో జనరల్ వార్డులో ఓ చివరి మంచంలో ఉన్నప్పుడు చనిపోతున్నాననే అనుకున్నాను. నా కుటుంబసభ్యులు, స్నేహితులు నన్ను వదిలేసి వెళ్లిపోయారు. నా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని డాక్టర్ చెప్పినప్పుడు ఇక మరణం తప్పదని భావించాను. టిబితో బాగా బలహీన పడిపోయాను. నటిగా నన్ను ఎందరో ఇష్టపడటాన్ని చూశాను. కానీ ఎవ్వరూ తోడు లేని పరిస్థితుల్లో ఒంటరిగా మరణించబోతున్నానని అనుకున్నాను. కానీ నా కథ ఇలా ముగిసిపోకూడదని వ్యాధితో పోరాడుతున్నాను. నాకు అండగా నిలిచిన సల్మాన్‌ఖాన్‌కి ధన్యవాదాలు. నా దుస్తులు, ఆహారం, సబ్బులు, మందులు అన్ని ఆయన ఫౌండేషనే నాకు సమకూర్చింది. నేను ఈమాత్రం కోలుకున్నాను అంటే కారణం సల్మానే అని చెప్పుకొచ్చింది.
1990లో వచ్చిన 'వీర్‌గతి' సినిమాలో సల్మాన్‌తో పాటు పూజా నటించింది. గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్ చేస్తున్న పూజాకు కొన్నేళ్ల కిందట క్షయ వ్యాధి సోకింది. దీంతో కట్టుకున్న భర్తతో పాటు బంధువులు, స్నేహితులు అందరు ఆమెని విడిచి వెళ్లిపోయారు. ఇలాంటి వారి గాధలైనా రాబోయే తరాల వారికి గుణపాఠంగా నిలుస్తాయని భావిద్దాం.