దర్శకులు సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అంటారు. కానీ దర్శకుల కంటే నటీనటులకు ఎక్కువగా భారీ పారితోషికాలు లభిస్తాయి. దానికి బలమైన కారణం కూడా ఉంది. ఎంత పెద్ద దర్శకుడైనా స్టార్ హీరోలతో తాను చెప్పాలనుకున్న పాయింట్ చెబితే వచ్చే రెస్పాన్సే వేరుగా ఉంటుంది. థియేటర్ల వద్దకు జనాలను తెప్పించే స్థాయి హీరోలకి ఉంది. ఇక నటీనటులకు ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. నటుడు ఏ మూడ్‌లో ఉన్నా, ఎలాంటి చికాకులు, ఆందోళన, కోపం, బాధలో ఉన్నా కూడా దర్శకుడు చెప్పిన వెంటనే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన భావోద్వేగాలన్నింటిని మర్చిపోయి మరీ ప్రేక్షకులను రంజింపజేస్తాడు. ఒకేరోజు మూడు, నాలుగు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొని, ఒకచోట హాస్య సన్నివేశం, వెంటనే ట్రాజెడీ సీన్.. ఆ వెంటనే మరో రసాన్ని పండించాల్సి వుంటుంది.
ఇక విషయానికి వస్తే ఒకేసారి రెండు మూడు డిఫరెంట్ చిత్రాలలో వెరైటీ పాత్రలు చేయడం కష్టసాధ్యమైన పనే. కానీ తనకు నటిగా నిరూపించుకోవాలంటే ఇలాంటి చిత్రాలను చేయాల్సిందేనని శ్రద్దాకపూర్ అంటోంది. ఇలా భిన్నమైన పాత్రలు చేయడం నన్ను నటిగా మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతోందని ఆమె అంటోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ, నేను నటించిన 'స్త్రీ' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఆ వెంటనే కొన్నిరోజులకే మరో చిత్రం 'బట్టి గుల్ మీటర్ చల్' సినిమా రిలీజ్ కానుంది. వీటితో పాటు 'సాహో' చిత్రంతో పాటు బాడ్మింటన్ ప్లేయర్ సైనానెహ్వాల్ బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నాను. ఒకేసారి ఇలా వేర్వేరు చిత్రాలలో నటించడం కాస్త ఇబ్బందికరమే అయినా ఇది నటిగా నాకు మేలు చేస్తుంది. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు షూటింగ్ అయ్యేంత వరకు ఒకే పాత్రలో ఒదిగిపోవడం వీలుకాదు. దానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ చిత్రాలలోని పాత్రలన్ని ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. అయినా ఇలాంటి విభిన్నపాత్రలకు దర్శకులు ఏరికోరి నన్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. సైనానెహ్వాల్ చిత్రానికి ఫిట్‌నెస్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న సైనానెహ్వాల్ పాత్రలో నేను నటిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చే నెల నుంచి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం సిద్దమవుతున్నాను.