'అల్లుడుగారు' ముందు వరకు ఐరన్‌లెగ్‌గా పేరుతెచ్చుకున్న నటి.. రమ్యకృష్ణ. కానీ ఆ చిత్రంలో మూగదానిలా ఆమె చేసిన పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుంచి ఆమె మరలా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణల చిత్రాలలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న పాత్రలను చేసి మెప్పించింది. ఇక ఈమె రజనీకాంత్ 'నరసింహ'లో చేసిన నీలాంబరి పాత్ర ఆమెకి రజనీతో పోటీపడి నటించిందనే గుర్తింపును తీసుకుని వచ్చింది. ఆ చిత్రం తర్వాత మరలా 'బాహుబలి'లో ఆమె శివగామిగా శివాలెత్తి నటించి మెప్పించింది. దీంతో ఈమెకి తెలుగులోనే కాదు తమిళంలో కూడా మంచి పాత్రలు వస్తున్నాయి.
ఇటీవలే ఆమె సూర్య చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె కీలకమైన అత్త పాత్రలో 'శైలజారెడ్డి అల్లుడు' అనే చిత్రంలో టైటిల్ అయిన శైలజారెడ్డిగా నటిస్తుండగా, అల్లుడిగా నాగచైతన్య యాక్ట్ చేస్తున్నాడు. 'భలే భలే మగాడివోయ్, మహానుభావుడు' వంటి సూపర్‌హిట్స్ అందుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలైతే ఆమెకి అత్తగా బాగా పేరొస్తుందని ప్రచారం సాగుతోంది. దాంతో పలువురు నిర్మాతలు ఆమెని ముందుగానే తమ తమ చిత్రాలలో తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇలా నాలుగైదు చిత్రాలను రమ్యకృష్ణ ఇప్పటికే ఓకే చేసిందని సమాచారం.
ఇక 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి హిట్ చిత్రాన్ని తీసిన యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర త్వరలో మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో కీలకమైన పాత్ర కోసం ఆయన రమ్యకృష్ణని అప్రోచ్ కాగా ఆమెకి కథ, తన పాత్ర బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందిట. ఇక రమ్యకృష్ణ గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి అత్త పాత్రలో 'నా అల్లుడు' చిత్రం చేసింది. కానీ ఆ చిత్రం పరాజయం పాలైంది. మరి ఈసారి అత్తగా ఆమె 'శైలజారెడ్డి అల్లుడు'తో ఎంత పెద్ద హిట్ కొడుతుందో వేచిచూడాల్సివుంది.