బాలీవుడ్ విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు దక్షిణాది తారలుగా వెలుగొందారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికి ఐదారు మంది బాలీవుడ్ హీరోయిన్లు వరుసగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. వారిలో బాగా రాణించేవారు మాత్రం అరుదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ హీరోలకు మాత్రం ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉండదు. ఇక బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడిల కుమారుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరోగా రాణిస్తుండగా, వారి చిన్నకుమార్తె సోహా అలీ ఖాన్ కూడా హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ఈమె 2004లో 'ఇతి శ్రీకాంత' అనే బెంగాళీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది.
ఇక ఈమె నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం 'దిల్‌మాంగేమోర్' 2004లోనే వచ్చింది. ఇక ఈమె హిందీ, బెంగాళీ, ఇంగ్లీషు చిత్రాలలో కూడా నటించింది. విద్యాభాస్యం మొత్తం లండన్, అమెరికాలో చదువుకున్న ఈమె తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో సందడి చేసింది. నాకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. నా బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచింది. మా అత్తగారు ఇక్కడే బేగంపేటలో ఉండేవారు. నేను తరుచు హైదరాబాద్ వస్తూ ఉంటాను అని చెప్పింది. ఈమె కృనాల్ కెమ్‌ని 2015లో వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ఈమె పలు చిత్రాలలో నటిస్తోంది.
తాజాగా 'సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3'లో నటించింది. ఇక ఈమె మాట్లాడుతూ, అవకాశం వస్తే టాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా నటించాలని ఉందని, ముంబైలోని కంట్రీ క్లబ్‌కి తరచుగా వెళ్తూ, నాకెంతో ఇష్టమైన చికెన్ టిక్కాను తింటానని తెలిపింది. మరి ఈమెకు తెలుగులో ఏ దర్శకనిర్మాతలు, హీరోలు చాన్స్‌లు ఇస్తారో వేచిచూడాల్సివుంది...!