దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగు నిర్మాణ సంస్థల్లో నేటికి వరుసగా చిత్రాలు నిర్మిస్తూ, ఏ ట్రెండ్‌కి తగ్గ చిత్రాలను, ప్రేక్షకులను అలరిస్తూ, విజయాలను కైవసం చేసుకున్న సంస్థ గీతాఆర్ట్స్. ఇక క్రియేటివ్ కమర్షియల్, వైజయంతీ మూవీస్ సంస్థలు మరలా తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నాయి. అదే సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ ఎప్పుడో ఒకటి అరా చిత్రాలను నిర్మిస్తోంది. దేవివరప్రసాద్, కాట్రగడ్డ మురారి, ఎస్.గోపాలరెడ్డి వంటి సంస్థలు మూతపడ్డాయి. కానీ మెగా హీరోల అండతో మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ మాత్రం ఇంకా తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌లలో కూడా సినిమాలు నిర్మించి మెగా ప్రొడ్యూసర్‌గా ఖ్యాతిని గడించాడు. ఈయన మెగా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తుండగా, ఇతర హీరోలతో మీడియం బడ్జెట్ చిత్రాలను బన్నీ వాసు నిర్మాతగా 'గీతాఆర్ట్స్ 2'లో తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈయన జ్ఞానవేల్‌రాజా, యువి క్రియేషన్స్ భాగస్వామ్యంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిన్న చిత్రాల కోసం ముచ్చటగా వి4 అనే సంస్థలో ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్‌తో 'నెక్ట్స్ నువ్వే' చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం ప్లాప్‌కావడంతో వరుసగా ఈ బేనర్‌లో సినిమాలు నిర్మిస్తామని చెప్పిన ఆయన ఎందుకో గానీ తదుపరి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించలేదు. ఇక ఈయన మెగాస్టార్ చిరంజీవి 150, 151 చిత్రాలను నిర్మించాలని ఆరాటపడ్డాడు. కానీ రామ్‌చరణ్ కొణిదెల బేనర్‌తో తమ సొంత నిర్మాణ సంస్థను స్థాపించి 'ఖైదీనెంబర్ 150' ప్రస్తుతం 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రాలను నిర్మిస్తున్నాడు. దీని తర్వాత కూడా మెగాస్టార్ చిరు కొరటాల శివ దర్శకత్వంలో నటించే చిత్రాన్ని రామ్‌చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిరంజన్‌లు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇక ఆ తర్వాతి చిత్రం అల్లుఅరవింద్, చిరంజీవితో, బోయపాటిశ్రీను దర్శకత్వంలో చేయనున్నాడట. 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' తర్వాత బన్నీ నటించే చిత్రం కూడా గీతాఆర్ట్స్‌లో నిర్మించనున్నాడు.
ఇక వరుస హిట్స్‌తో ఉన్న యంగ్ మెగాహీరో వరుణ్‌తేజ్‌తో కూడా అల్లుఅరవింద్ మరో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ విశేషాలను ఆయన ఇటీవల సొంత పని మీద తాడేపల్లి గూడెం వెళ్లిన సందర్భంగా తెలిపాడు. ఇక గీతాఆర్ట్స్2లో విజయ్‌దేవరకొండ హీరోగా ఈయన 'ట్యాక్సీవాలా, గీతగోవిందం' చిత్రాలను నిర్మించాడు. 'గీతగోవిందం' ఈనెల 15న విడుదల కానుండగా, 'ట్యాక్సీవాలా' కూడా మరోనెల తర్వాత విడుదల అవుతుంది. మొత్తానికి గీతాఆర్ట్స్‌లో 'సరైనోడు, ధృవ' తర్వాత మరలా చిరు, బన్నీ, వరుణ్‌లతో అల్లుఅరవింద్ చిత్రాలు నిర్మించనుండటం విశేషం.