నా పేరు సూర్య సినిమా తరువాత మరో సినిమాని అల్లు అర్జున్ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా ఇదిగో అదిగో అంటున్నారు కానీ పట్టాలెక్కడం లేదు. సినిమా కథలోని మార్పులను చేర్పులను బన్నీకి అనుకూలంగా విక్రమ్ చేయలేకపోవడం వలెనే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని... స్వయంగా అల్లు అర్జున్ చెబుతున్నాడు. నా సినిమా మరింత లేట్ అవుతుంది అభిమానులు శాంతించండి అని. అయితే అల్లు అర్జున్ తాజాగా సై రా నరసింహారెడ్డిలో ఒక అతిధి పాత్రలో మెరవబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. చిరు హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడనేది లేటెస్ట్ గా అందుతున్న న్యూస్.
మరి ఇదివరకు చిరు సినిమాల్లో అల్లు అర్జున్ చిన్న పాత్రల్లో కనిపించాడు. డాడీ సినిమాలో డాన్సర్ గాను, శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో స్టెప్స్ వేశాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అతిధి పాత్రే అయినప్పటికీ.... ఆ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర ఎంతో కీలకమే కాదు.. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటనకు... అల్లు అర్జున్ మాట్లాడిన తెలంగాణ భాషకు అందరూ పడిపోయారు. మరి రుద్రమదేవిలో చేసిన గోన గన్నారెడ్డి పాత్ర వంటి పాత్రే సై రా లో అల్లు అర్జున్ చెయ్యబోతున్నాడంటూ.. ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
అయితే సురేందర్ రెడ్డి కోరిక మేరకు, చిరు మీద అభిమానంతో అల్లు అర్జున్ సై రా సినిమాలో ఒక పాత్ర చెయ్యడం పక్కా... అని ఇక కేవలం అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. మరి ఇప్పటికే సై రా నరసింహారెడ్డి కోసం మహామహులు రంగంలోకి దిగారు. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి.. ఇలా పరభాషల్లో మేటి నటులు మాత్రమే కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంటే నిజంగానే సై రా నరసింహారెడ్డిపై మరిన్ని అంచనాలు పెరుగుతాయనడంలో సందేహమే లేదు. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సైరా నరసింహారెడ్డి చిత్ర బృందం త్వరలోనే ఫారిన్ వెళ్లనుంది.