పాత క్లాసిక్ టైటిల్స్‌ని వాడుకునేప్పుడు వీలైనంతగా జాగ్రత్తలు పాటించాలి. గతంలోనే ఇలా 'శంకరాభరణం, రక్తసంబంధం, మరోచరిత్ర, ప్రేమాభిషేకం' వంటి ఎన్నో చిత్రాలు పాత క్లాసిక్ చిత్రాల పేర్లను పొగొట్టాయి. ఇక విషయానికి వస్తే 'ఛలో'తో నిర్మాతగా, హీరోగా కూడా తన కెరీర్‌లో అతి పెద్ద హిట్‌ని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. అదే బ్యానర్ లో తనే హీరోగా మరో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పేరు అలనాటి కళాఖండం 'నర్తనశాల' టైటిల్‌ని దీనికి ఫిక్స్ చేశారు. బహుశా ఇందులో కూడా బృహన్నల టైప్‌లో కాస్త అటు ఇటుగాని పాత్రలో నాగశౌర్య నటిస్తున్నాడేమో అనే అనుమానం వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు.
టీజర్ ఆద్యంతం వినోదంగా ఉంది. నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ఎండింగ్‌లో 'నా కొడుకు గే నా'అని తండ్రి శివాజీరాజా ప్రశ్నించడం చూస్తే ఈ చిత్రానికి '@నర్తనశాల' అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లారిటీ వస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా శ్రీనివాస చక్రవర్తి అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. వెంకీ కుడుముల టాలెంట్‌ని చూసి 'ఛలో'కి అవకాశం ఇచ్చిన నాగశౌర్య ప్రస్తుతం పరిచయం చేస్తోన్న మరో యంగ్ డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి ఏ విధంగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటాడో చూడాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.