ప్రస్తుతం దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాజకీయ నాయకుడు కేటీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయునిగా కాకుండా తనకంటూ స్పెషల్ క్రేజ్, ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. తెలంగాణ కోసం ప్రత్యక్ష్య పోరాటం చేసి, తర్వాత ఎన్నికల్లో గెలిచి మరీ మంత్రి పదవి చేపట్టాడు. ఈయనకు సినిమాలంటే కూడా బాగా ఆసక్తి అని ఆయన చేసే ట్వీట్స్‌ని చూస్తే తెలుస్తోంది. ప్రతి చిత్రాన్ని చూసి తనకు నచ్చిన సినిమాలను పొడగ్తలతో ముంచెత్తుతూ, ప్రమోషన్స్ కూడా చేస్తుంటాడు. చిరంజీవి నుంచి మహేష్‌బాబు, విజయ్‌దేవరకొండ, సమంత, నాగార్జున నుంచి సుబ్బరాజు వరకు ఆయన మాయలో పడేలా చేస్తున్నాడు. ఏదైనా చిత్రాన్ని చూసి కేటీఆర్ ప్రశంసించాడంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వారు అదో గొప్ప కాంప్లిమెంట్‌గా ఫీలయ్యేలా చేయగలిగాడు.
ఇక కేటీఆర్ బాటలోనే అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా పరోక్షంగా ఎమ్మెల్సీ అయి కేటీఆర్ తీసుకున్న శాఖలనే తాను కూడా తీసుకున్న చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రతి విషయంలోనూ కేటీఆర్‌ని ఫాలో అవుతున్నాడు. ఇక ఈయన తన మామగారైన నందమూరి బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి, జైసింహా' చిత్రాలతో పాటు 'మహానటి, భరత్ అనేనేను' వంటి చిత్రాలను ప్రశంసించినా ఆయనకు మాత్రం కేటీఆర్‌లా క్రేజ్ రావడం లేదు. బహుశా నంది అవార్డుల సమయంలో ఆయన హైదరాబాద్‌లో సెటిల్ అయిన సినిమా వారిని ఏపీలో ఆధార్‌కార్డులేని వారు కూడా మాట్లాడుతున్నారని విమర్శించడం ఆయనకు పెద్ద మైనస్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇక తాజాగా ఈయన 'గూఢచారి' చిత్రం చూశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పై మూవీగా తయారైన గూఢచారి చిత్రంలో ప్రతి నిమిషాన్ని నేను ఎంజాయ్ చేశాను. అడవిశేషు, శోభితా దూళిపాళ, ప్రకాష్‌రాజ్, దర్శకుడు శశికిరణ్ ఇతర తారాగణం, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ ఎంతో కష్టపడ్డారని ట్వీట్ చేస్తూ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. కానీ ఇలా ఆలస్యంగా స్పందిస్తే దాని వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. మరోవైపు 'గూఢచారి' చిత్రం మంచి విజయవంతమైన టాక్‌తో దూసుకుని పోతోంది.