సినిమా ఫీల్డ్‌లో ముందు చూపు ఉండాలి. ఉదాహరణకు నాగార్జున 'మనం' చిత్రం కోసం సెట్ వేసి, దానిని ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. దాంతో ఆ సెట్ ప్రమాదవశాత్తు తగలబడినా తీపి జ్ఞాపకాలైతే బూడిద అయ్యాయి కానీ ఆర్ధికంగా ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలోనే లభించింది. ఇక 'బాహుబలి' సినిమా కోసం రామోజీ ఫిలింసీటీలో వేసిన భారీ సెట్స్‌ని అలాగే ఉంచి అక్కడకి వచ్చే యాత్రికులకు సందర్శనార్ధం ఉంచి, దానికి ఎంట్రీ చార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. ఇక అదే సెట్‌లో ప్రస్తుతం 'బాహుబలి' నిర్మాతలే తీస్తున్న టెలిసీరియల్ 'స్వర్ణఖడ్గం' షూటింగ్ జరుపుతున్నారు.
గతంలో కూడా మహేష్‌బాబు నటించిన 'అర్జున్' చిత్రంలోని మధుర మీనాక్షి టెంపుల్, 'ఒక్కడు' చార్మినార్ సెట్, కృష్ణ 'సింహాసనం', మంచు వారి 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' సెట్స్‌ని కూడా అలానే ఉంచి ఇతర చిత్రాల షూటింగ్‌లకు అనుమతి ఇచ్చి ఆర్ధికంగా లాభాలు ఆర్జించారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్, అందునా 'బాహుబలి' రేంజ్‌ని మించి తీయాలని స్వయాన రామ్‌చరణ్ నిర్మాతగా 'కొణిదెల బేనర్'లో 'సై..రా..నరసింహారెడ్డి' షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని శేర్‌లింగంపల్లి వద్ద వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ జరుపుతున్నారు. కానీ ఈ యూనిట్ ముందు చూపుతో వ్యవహరించలేకపోయింది. ముందుగా రెవిన్యూ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా కోట్ల రూపాయలతో సెట్స్ వేశారు. అక్కడి 20ఎకరాలను రామ్‌చరణ్ సొంతం చేసుకుని అక్కడే చిరంజీవి ఫ్యామిలీ తరపున స్టూడియో కూడా పర్మినెంట్‌గా నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి.
కానీ ఈ సెట్‌ని రెవిన్యూ అధికారులు పర్మిషన్ లేకుండా వేసినందుకు కూల్చివేశారు. దాంతో షూటింగ్ ఆగిపోయింది. దీని వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కాకూడదని భావించిన రామ్‌చరణ్ మరో చోట మరలా భారీ బడ్జెట్ కేటాయించి రెండో సారి సెట్స్‌ని వేశాడని తెలుస్తోంది. ఇందులోనే బ్రిటిషర్లతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసే పోరాటాలను చిత్రీకరించనున్నారట. కాగా చిరంజీవి జన్మదిన కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు.