రచయితలుగా ఎంతో అనుభవం ఉన్న పరుచూరి బ్రదర్స్ తమ చిత్రాల విజయాలు, పరాజయాలపై కూడా స్కానింగ్ చేసుకుంటూ, ఆత్మ పరిశీలన బాగా చేసుకుంటారు. కాబట్టే వారు మూడు తరాల ప్రేక్షకులను, దర్శక నిర్మాతలు, హీరోలను మెప్పించగలిగి, మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా తాము కూడా తమ మైండ్‌సెట్‌ని మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేటితరం రచయితలు, దర్శకులు మాత్రం ఓ చిత్రం హిట్ అయితే ఎందుకు హిట్ అయింది? ప్లాప్ అయితే దానికి కారణాలు ఏమిటి? అనేది ఆలోచించకుండా మంచి సినిమా అంటూ ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు.
ఇక తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... 'త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఎందుకు ఫ్లాప్ అయిందో చెబుతూ మంచి ఎనలైజేషన్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... 'అత్తారింటికి దారేది' చిత్రంలో సీఈవోలందరు రౌండ్ టేబుల్స్ మీద కూర్చుని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయి. అలాంటి సీన్స్‌నే 'అజ్ఞాతవాసి'లో పెట్టడం వల్ల అవి రిపిటేషన్‌గా అనిపించి బోర్ కొట్టించాయి. వాటిని తీసేసి చేసి ఉంటే బాగుండేది. ఇక 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో తన మేనత్త నదియా వద్ద కన్నీరు పెట్టుకుంటాడు. అదే విధంగా 'అజ్ఞాతవాసి'లో కూడా హీరో ఖుష్బూ ముందు కన్నీరు పెట్టుకుంటాడు.
'అబ్బా.. మరలా అలాంటి సీనేనా అనిపిస్తుంది' పవన్‌తో అంతకు ముందు చేసిన సీన్స్ వంటివి దగ్గరగా ఉండకుండా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. మరో పాయింట్ ఏమిటంటే. . విలన్లపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన హీరో వారిని అలా వదిలేసినట్లు అయింది. ఏదేమైనా త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు. పవన్ ఎంతో మంచి నటుడు. పవన్ మరలా సినిమాలలో నటించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనూ ఆయన అభిమానినే' అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.