మూడు నెలలు కిందట వచ్చిన 'మహానటి' సినిమా తప్ప అమెరికా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా అంతగా ఆడలేకపోయాయి. మొన్న వచ్చిన సుధీర్ బాబు చిత్రం ‘సమ్మోహనం’ ఓ మోస్తారుగా ఆడినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తీవ్ర నిరాశను కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన ‘ఆర్ఎక్స్ 100’ సైతం యుఎస్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అడివి శేష్ సినిమా ‘గూఢచారి’తో అమెరికా తెలుగు బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ శనివారానికే 3 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ సినిమా ముప్పావు మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఈ సినిమా 6 కోట్లతో తెరకెక్కింది. మంచి టాక్ తో రన్ అవుతున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ తో పాటు తొలి వారాంతంలోనే పెట్టుబడిని వెనక్కి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా మొన్న రిలీజ్ అయిన 'చి ల సౌ’ సైతం అమెరికాలో బాగానే ఆడుతోంది. ఈ చిత్రం లక్ష డాలర్ల మార్కును దాటింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన ఇంకో సినిమా ‘బ్రాండ్ బాబు’ మాత్రం బ్రాండ్ చూపించలేక పోయింది. ఇక వచ్చే వారం రిలీజ్ అయ్యే ‘శ్రీనివాస కళ్యాణం’, ‘విశ్వరూపం’కు అమెరికాలో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.