అచ్చమైన తెలుగు నటుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, కామెడీ విలన్.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు సుబ్బరాజు. ఈయన కృష్ణవంశీ 'ఖడ్గం' ద్వారా పరిచయమై 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పోకిరి, బిజినెస్‌మేన్, దూకుడు, బాహుబలి-కన్‌క్లూజన్' వంటి ఎన్నో చిత్రాలలో తన ప్రతిభను చూపి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈయన తెలుగులోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ ఇలా అన్ని భాషల్లో నటించాడు. ముఖ్యంగా 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రంలో నటించి బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ ప్రశంసలు పొందాడు. కృష్ణవంశీ, రాజమౌళి, శ్రీనువైట్ల, పూరీ జగన్నాథ్.. ఇలా వీరి చిత్రాలలో ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే.
ఇక ఈయన 'బాహుబలి-కన్‌క్లూజన్'లో నటించగా, దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. కానీ ఆ చిత్రం కోసం ఆ సమయంలో వచ్చిన ఎన్నో చిత్రాలు వదులుకున్నాడు. దాంతో ఆయన నాడు నో చెప్పిన చిత్రాలలో ఇతరులు పోషించిన పాత్రలు వున్న చిత్రాలు ఇప్పుడు విడుదల అవుతున్నాయి. ఇక విషయానికి వస్తే తాజాగా సుబ్బరాజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా జరిగిన ఓ పార్టీకి కేటీఆర్, సుబ్బరాజులతో పాటు పలువురు హాజరయ్యారు. దాంతో అక్కడే ఉన్న కేటీఆర్ వద్దకు వచ్చిన సుబ్బరాజు సీఎం రిలీఫ్ ఫండ్‌కి తనవంతు సాయంగా కేటీఆర్‌కి చెక్‌ని అందించాడు. ఈ విషయాన్ని కేసీఆర్ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు. రాత్రి నేను ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లాను. అదే సమయంలో సుబ్బరాజు నా వైపు రావడం చూసి ఆశ్చర్యపోయాను. దగ్గరకు వచ్చిన తర్వాత సుబ్బరాజు సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెక్ అందించారు. 'మీ సహృదయానికి చాలా థ్యాంక్స్ బ్రదర్' అని తెలిపాడు.
అయితే సుబ్బరాజు ఎంత మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చాడో మాత్రం కేటీఆర్ తెలియజేయలేదు. దీంతో నెటిజన్లు రీల్ లైఫ్‌లో విలన్ అయినా, సుబ్బరాజు రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇటీవల ఫిలింఫేర్ అవార్డు పొందిన హీరో విజయ్‌దేవరకొండ తనకి వచ్చిన బహుమతిని వేలం వేయగా వచ్చిన 25లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చిన సంగతి తెలిసిందే.